ఊహించని కరోనా విపత్తు ప్రపంచాన్ని స్థంభింప చేయగా అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. ఇక చిత్ర పరిశ్రమ దాదాపు ఆరు నెలలకు పైగా కఠిన పరిస్థితులు ఎదుర్కొంటుంది. చిత్రాల విడుదల మరియు షూటింగ్స్ ఆగిపోవడం జరిగింది. కోవిడ్ కి భయపడి చాలా మంది సీనియర్ హీరోలు షూటింగ్స్ కి ససేమిరా అంటున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలయ్య, నాగార్జున మరియు వెంకటేష్ చాలా కాలంగా షూటింగ్ కి దూరంగా ఉంటున్నారు. ఈ నలుగురిలో నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ మొదలుపెట్టేశాడు. 

తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం షూటింగ్ కి సిద్ధం అని ప్రకటన చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఆచార్య షూటింగ్ పై అప్డేట్ నిర్మాతలు ఇచ్చారు. నవంబర్ 9నుండి ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభం కానుందని కొణిదెల ప్రొడక్షన్ హౌస్ తెలియజేశారు. కఠిన కోవిడ్ భద్రతా నియమాలు, నిబంధనల మధ్య ఆచార్య షూటింగ్ జరపనున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. దీనితో మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపినట్లు అయ్యింది. 

లాక్ డౌన్ లేని పక్షంలో దసరా లేదా దీపావళికి ఆచార్య విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావించారు. దాదాపు 40శాతం షూటింగ్ పూర్తయిన తరువాత కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితులు షూటింగ్ కి బ్రేక్ వేశాయి. తాజా అప్డేట్ మెగా ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుండగా, వచ్చే ఏడాది సమ్మర్ కి ఆచార్య విడుదల అవుతుందే ఆశ బలపడింది. 

బలమైన ఓ సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కొరటాల మార్క్ కమర్షియల్ అంశాలు జోడించి తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి బర్త్ డే కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ విశేష ఆదరణ దక్కించుకుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి. ఆచార్య మూవీలో రామ్ చరణ్ కీలక రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.