సింగర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్ చిన్మయికి గత 6 ఏళ్లుగా తమిళ సినిమాల్లో పాటలు పాడటంపై నిషేధం ఉంది. మరి ఇంత కాలం ఆమె ఎందుకు బ్యాన్‌ని ఫేస్‌ చేస్తుందనే విషయాన్ని  వెల్లడించారు. 

 ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తన కెరీర్‌లో ఎదుర్కొన్న సవాళ్ల గురించి, వాటి నుంచి బయటపడి విజయం సాధించడం గురించి తరచూ మాట్లాడుతుంటారు. కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన 'థగ్ లైఫ్' సినిమాలోని 'ముత్త మల్లే' పాటను ఆడియో లాంచ్ ఈవెంట్‌లో చిన్మయి పాడటం వైరల్ అయ్యాక, తన బాధ, ఆనందాన్ని పంచుకున్నారు.

`థగ్ లైఫ్' ఆడియో లాంచ్‌లో చిన్మయి పాడిన వీడియో సోషల్ మీడియాలో లక్షల వ్యూస్, ప్రశంసలు అందుకుంది. ఈ ఊహించని ఆదరణ చిన్మయిని కదిలించింది. తన ఆరేళ్ల పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు.

కన్నీళ్లు పెట్టుకున్న చిన్మయి

చిన్మయి తన పోస్ట్‌లో, ``థగ్ లైఫ్` వీడియో వైరల్ అయినప్పుడు నాకు చాలా టెన్షన్‌గా అనిపించింది. గత ఆరేళ్లుగా తమిళ సినిమాల్లో నేను ఎదుర్కొంటున్న నిషేధం గురించి మీకు తెలుసు. ఈ సమయంలో ఎన్నో ఆలయాల్లో కన్నీళ్లు పెట్టుకున్నా. దేవుడికి మొక్కుకుని బయటకు వచ్చాక ధైర్యంగా నటిస్తూ బతికా. నా ప్రార్థనలకు దేవుడు ఎప్పుడు సమాధానం ఇస్తాడని ఎదురుచూశా" అని తన బాధను వ్యక్తం చేశారు.

"ఈ పాట విజయం నా ప్రార్థనకు దక్కిన ఫలితంలా అనిపిస్తోంది. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్, దర్శకుడు మణిరత్నం సార్‌కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను నమ్మి, నా గొంతుకు మళ్లీ ఛాన్స్ ఇచ్చినందుకు నేనెప్పుడూ రుణపడి ఉంటా" అని కృతజ్ఞతలు తెలిపారు.

క్షమాపణ చెప్పనన్న చిన్మయి

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై విధించిన నిషేధం గురించి చిన్మయి మాట్లాడారు. “నేను చందా కట్టలేదని డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించామన్నారు. కానీ నిజమైన కారణం నేను మీటూలో మాట్లాడినదే. నాకు నిషేధం విధించడం లెటర్ ద్వారా తెలిసింది. 

తిరిగి చేరాలంటే క్షమాపణ చెప్పాలన్నారు. అంటే ఆయన కాళ్ల మీద పడాలని చాలా ప్రోసీజర్ ఉంది. అందుకే నేను వద్దన్నా. వారం క్రితం కూడా క్షమాపణ లెటర్ ఇవ్వమన్నారు. నేను ఎందుకు ఇవ్వాలి? అదంతా వద్దనుకున్నా” అని చిన్మయి చెప్పారు.

రైటర్‌ వైరముత్తుపై లైంగిక ఆరోపణలే బ్యాన్‌కి కారణమా?

2018లో మీటూ ఉద్యమంలో భాగంగా ప్రముఖ గేయ రచయిత వైరముతుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు చిన్మయి. దీంతో తమిళ సినిమాల్లో ఆమెకు పాటలు పాడే అవకాశాలు పూర్తిగా ఆగిపోయాయి. డబ్బింగ్ యూనియన్ నుంచి కూడా తొలగించారు. ఇన్ని కష్టాల్లోనూ తెలుగు సినిమాల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, గాయనిగా కొనసాగుతున్నారు.

ఆరేళ్ల తర్వాత తమిళ సినిమాలో చిన్మయికి అవకాశం ఇవ్వడం ఆమె జీవితంలో పెద్ద మలుపుగా చూస్తున్నారు. `ముత్త మలై` కేవలం పాటే కాదు, గొంతు విప్పిన వారి విజయం అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.