ప్రముఖ గాయని చిన్మయి మీటూ ఉద్యమం కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో పోరాటానికి ఆమె సిద్ధమయ్యారు. తమిళ డబ్బింగ్ యూనియన్ కి ఆమె చెల్లించాల్సిన సభ్యత్వ రుసుము రెండేళ్లుగా చెల్లించడం లేదనే కారణంతో ఆమెని యూనియన్ నుండి తొలగించిన సంగతి తెలిసిందే.

ఈ కారణంగా ఆమె తమిళ సినిమాల్లో పాటలు పాడకూడదు అలానే డబ్బింగ్ కూడా చెప్పకూడదు. ఈ విషయంపై స్పందించిన చిన్మయి కావాలనే ఇదంతా చేస్తున్నారని డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధారవి అలానే గీత రచయిత వైరముత్తులపై ఆరోపణలు చేసింది.

తాజాగా మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ 19 నిమిషాలు గల వీడియోని యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. ఫీజు చెల్లించినా.. కావాలనే తనను అన్యాయంగా తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ''తమిళ డబ్బింగ్ యూనియన్ కి సంబంధించిన జీవితకాల సభ్యత్వాన్ని నేను చెల్లించాను. 2016, ఫిబ్రవరి 11న బ్యాంక్ ద్వారా ఈ చెల్లింపు చేశాను. ఆ సమయంలో యూనియన్ వాళ్లు నాకు రసీదు ఇవ్వడానికి నిరాకరించారు.

రసీదు చూపించలేదనే కారణంతో డబ్బింగ్ యూనియన్ గత ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయాను. కానీ ఆ సమయంలో నేను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలాంటి నోటీసులు, హెచ్చరికలు జారీ చేయకుండా నా సభ్యత్వాన్ని కావాలని రద్దు చేశారు. కేవలం రాధారవి వేధింపులకు గురైన కొంతమంది బాధిత మహిళలకు నేను మద్దతుగా ఉన్నందుకు ప్రతీకారంగా ఇదంతా చేస్తున్నారు'' అంటూ బ్యాంక్ స్టేట్మెంట్ ని పోస్ట్ చేశారు.