సినీ నటి కరాటే కల్యాణి వరుసగా వివాదాలకే కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు. తాజాగా కరాటే కల్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు. 

సినీ నటి కరాటే కల్యాణి వరుసగా వివాదాలకే కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు. తాజాగా కరాటే కల్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు. కరాటే కల్యాణి చిన్నారికి కొనుగోలు చేసినట్టుగా ఫిర్యాదులు అందడంతో.. అధికారులు ఈ సోదాలు చేపట్టారు. చిన్నారికి సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. చిన్నారిని చట్టబద్దంగా దత్తత తీసుకున్నారా..? అందుకు సంబంధించి పత్రాలు ఉన్నాయా..? అనే వివరాలను సేకరిస్తున్నారు. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇక, ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యూట్యూబ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కల్యాణి దాడి చేసింది. ప్రాంక్ వీడియోలు తీయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కల్యాణి.. శ్రీకాంత్ ఇంటికి వెళ్లి అతడిని నిలదీసింది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించింది. ఈ క్రమంలోనే అక్కడ గొడవ జరిగింది. తర్వాత శ్రీకాంత్ రెడ్డిపై కల్యాణి దాడి చేసింది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

మరోవైపు శ్రీకాంత్ తనపై కూడా దాడి చేసినట్టుగా కల్యాణి తెలిపింది. ఫ్రాంక్‌ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ యువతను చెడుదోవ పట్టిస్తున్నాడని, దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన తనతో పాటు నాలుగు నెలల చిన్నారిపై శ్రీకాంత్‌రెడ్డి దాడి చేశాడని కల్యాణి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరస్పరం ఫిర్యాదులు చేయడంతో ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తీరుపై కల్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘నాపై దాడి చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేస్తే ఇరువురిపై ఒకే రకమైన కేసులు పెట్టి నిందితునికి వంత పాడుతావా’’ అంటూ సినీనటి కరాటే కళ్యాణి ఎస్‌ఆర్‌నగర్‌ సీఐ సైదులుపై ఆగ్రహాంతో ఊగిపోయింది. 

ఇదిలా ఉంటే.. కరాటే కల్యాణితో తనకు ప్రాణభయం ఉందని మరో వ్యక్తి ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాదిలో జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ యువతిపై అత్యాచారం జరగగా ఈ కేసుకు సంబంధించి బాధితురాలి ఫొటోలు, పేర్లు ఇతర వివరాలను అప్పట్లో కల్యాణి మీడియాకు చెప్పింది. వెంగళరావునగర్‌లో ఉంటున్న కర్నూల్‌కు చెందిన నితేష్‌ అనే వ్యక్తి బాధితురాలి వివరాలను రహస్యంగా పెట్టాల్సింది పోయి మీడియాకు ఎందుకు చెప్పావంటూ కల్యాణిని ప్రశ్నించాడు. అయితే కల్యాణి ఎదురుతిరగడంతో అతడు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

దీంతో నితేష్‌పై కోపం పెంచుకున్న కల్యాణి తనపైనే ఫిర్యాదు చేస్తావా.. నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడిందని నితేష్ తెలిపాడు. అయితే తాజాగా కల్యాణిపై కేసు నమోదైనట్లు విషయం తెలుసుకున్న నితేష్‌ కల్యాణితో తనకు కూడా ప్రాణభయం ఉందంటూ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.