అభిమానం తలకెక్కిన.. అభిమానం పీక్‌లోకి వెళ్ళిన అది మంచిది కాదు.. దాని ఫలితంగా అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. శృతి మించిన అభిమానం రోడ్డున పడేసిన ఘటన ఓ చిరంజీవి అభిమానికి ఎదురైంది. మహబూబాబాద్‌కి చెందిన వ్యక్తి ఇప్పుడు అభిమాన హీరో కోసం అన్ని అమ్ముకుని రోడ్డున పడ్డాడు. 

ఆ వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్‌, భవానీ నగర్‌కి చెందిన భట్టు బాలాజీ అనే వ్యక్తి మెగాస్టార్‌ చిరంజీవికి వీరిభిమాని. ఆయనంటే ప్రాణమిచ్చేంత అభిమానం. చిరు సినిమా వచ్చిందంటే ఫస్ట్ షో చూడాల్సిందే. అంతేకాదు థియేటర్ల వద్ద తన సొంత ఖర్చులతో చిరు కటౌట్లు కట్టేవాడు, పాలాభిషేకం చేసేవాడు. వంద రోజుల ఫంక్షన్లు స్థానికంగా తన సొంత ఖర్చుతోనే నిర్వహించేవాడు. చిరంజీవి నటించిన `స్టేట్‌ రౌడీ` సినిమారోజు ఫస్ట్ షో సినిమా టికెట్‌ కోసం జరిగిన తోపులాటలో ఎడమ కన్ను పోగొట్టుకున్నాడు. దీనికోసం భారీగానే డబ్బులు ఖర్చు అయ్యాయి. 

అయినా అభిమాన హీరోపై అభిమానం తగ్గలేదు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ కోసం మానుకోట నుంచి 150 మందిని హైదరాబాద్‌ తీసుకొచ్చి రక్తదానం చేయించాడు. అందుకు తన సొంత డబ్బే పెట్టుకున్నాడు. అలాగే చిరంజీవి స్థాపించిన `ప్రజారాజ్యం` పార్టీ కోసం ప్రచారం కోసం, ఇతర కార్యక్రమాల కోసం తన ఉన్న ఆస్తిని అమ్ముకున్నారు. తండ్రి సంపాదించిన మూడెకరాల పొలాన్ని అమ్ముకున్నాడు. ఇప్పుడు రోడ్డు పడ్డాడు. నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్నారు. తన భార్య పూలు అమ్ముకుంటుంటే, తాను కూలీగా రోజువారి పనులు చేస్తున్నారు. తన పిల్లలు కూడా బాల కార్మికులుగా మారి ఇండ్లల్లో పనులు చేస్తున్నారు. 

తన బతుకు కష్టంగా మారింది. దీంతో తనకు సాయం చేయాలని వేడుకుంటున్నారు బాలాజీ. చిరంజీవిని కలిసేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నా, మధ్యలో ఉన్న వారు అడ్డుకుంటున్నారని, తనని చిరంజీవిని కలిసే అవకాశం కల్పించాలని రోడ్డుకెక్కాడు. నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి చిరంజీవి కరుణిస్తాడా ? అన్నది చూడాలి. అదే సమయంలో బాలాజీ చెప్పది నిజమేనా? అన్నది కూడా చూడాలి.