హైదరాబాద్ లో మలబార్ గోల్డ్ షోరూం ఓపెనింగ్ కు వచ్చిన తమన్నా తమన్నా రాకతో గుమిగూడిన అభిమానులు తమన్నాపై చెప్పులు విసిరిన ఆకతాయి

హైదరాబాద్ లో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మిల్కీ బ్యూటీ తమన్నాకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం నాడు నగల దుకాణం ప్రారంభానికి వచ్చిన ఆమెపై ఓ ఆకతాయి యువకుడు చెప్పు విసరడంతో కలకలం రేగింది. హిమాయత్‌నగర్‌లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దుకాణం ప్రారంభానికి విచ్చేసిన ఆమెపై కరీముద్దీన్‌ అనే బీటెక్‌ విద్యార్థి చెప్పు విసిరాడు. ఈ హఠత్పరిణామానికి తమన్నా షాక్‌కు గురయ్యారు. తన సన్నిహితులతో ఇదే విషయం గురించి వాపోయినట్లు సమాచారం. చెప్పు విసిరిన ఆకతాయిని నారాయణగూడ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు నిందితుడు కరీముద్దీన్‌ వారితో వాగ్వాదానికి దిగాడు. అంతేకాదు పక్కనే ఉన్నవారిపై సైతం వాదించినట్లు వీడియోలో రికార్డయ్యింది. విక్రమ్‌తో నటించిన ఖస్కెచ్ చిత్రం ఇటీవల తమిళంలో విడుదలై విజయం అందుకుంది. ప్రస్తుతం ఆమె ‘క్వీన్‌’రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నీలకంఠ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క కల్యాణ్‌రామ్‌తో ‘నా నువ్వే’ అనే సినిమాలోనూ తమన్నా కథానాయికగా నటిస్తోంది. జయేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.