సినీ నటుడు తారకరత్న మృతి చాలా దురదృష్టకరం, బాధకరమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
సినీ నటుడు తారకరత్న మృతి చాలా దురదృష్టకరం, బాధకరమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తారకరత్న కోలుకుని అందరి ముందుకు తిరిగి వస్తాడని ఆశించామని చెప్పారు. అయితే దారుణం జరిగిపోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం రంగారెడ్డి జిల్లా మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకున్న చంద్రబాబు దంపతులు.. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. తారకరత్నకు నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. అక్కడే ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కూడా చంద్రబాబు మాట్లాడారు. విజయసాయిరెడ్డి.. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి సమీప బంధువు అన్న సంగతి తెలిసిందే.
అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో విజయసాయరెడ్డి పక్కనే ఉన్నారు. తారకరత్న కోలుకోవాలని కుటుంబ సభ్యులు, అభిమానులు ప్రార్థనలు చేశారని చంద్రబాబు చెప్పారు. యువగళం పాదయాత్రలో పాల్గొన్న సమయంలో తారకరత్న అస్వస్థతకు గురయ్యారని.. వైద్యులు ఆయనను కాపాడేందుకు తీవ్రంగా కృషి చేశారని చెప్పారు. దురదృష్టవశాత్తు తారకరత్న నిన్న తుదిశ్వాస విడిచారని తెలిపారు. ఈ నెల 22వ తేదీ వస్తే.. తారకరత్నకు 40 ఏళ్లు అని.. ఇంత చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం చాలా బాధకరమని పేర్కొన్నారు.
సినిమాల్లో మంచి భవిష్యత్తు ఉన్న తారకరత్నకు ఎప్పుడూ రాజకీయాల పట్ల ఆసక్తి కనబరిచేవారని చెప్పారు. ఈసారి పోటీ చేయాలని ఉందని కూడా తనను కలిసిన సమయంలో తారకరత్న చెప్పారని తెలిపారు. సరైన సమయంలో మాట్లాడతానని ఆయనకు చెప్పానని పేర్కొన్నారు. కుటుంబం మొత్తం చాలా బాధగా ఉందని చెప్పారు. భగవంతుడు అన్ని విధాలుగా ఆ కుటుంబానికి సహకరించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. తాము అందరం కూడా కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. తారకరత్న ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. తారకరత్న సతీమణికి ధైర్యాన్ని ఇచ్చి, ముందుకు నడిచే శక్తిని ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు.
