విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన నటుడు చలపతిరావుకి ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరుంది. సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు ఇలా అందరితో కలిసి పని చేసిన ఆయనపై ఇప్పుడు జనాలకు నెగెటివ్ ఫీలింగ్ ఏర్పడింది. దానికి కారణం ఓ సినిమా ఈవెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు.

మహిళలను ఉద్దేశిస్తూ.. 'ఆడవాళ్లు పక్కలోకి మాత్రమే పనికొస్తారు' అంటూ నవ్వుతూ ఆయన చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపాయి.మహిళలు తీవ్రంగా వ్యతిరేకించారు. సోషల్ మీడియాలో అయితే చలపతిరావుపై విరుచుకుపడ్డారు. ఆయన్ని దారుణంగా ట్రోల్ చేశారు. 

ఇదంతా చూసి బాధ పడిన చలపతిరావు ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారట. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ కార్యక్రమంలో చెప్పారు. మహిళలంటే తనకు ఎంతో గౌరవమని.. కానీ సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ చూసి సూసైడ్ చేసుకుందామని అనుకున్నట్లు చలపతిరావు అన్నారు.

22 ఏళ్ల వయసులో భార్య చనిపోతే మళ్లీ పెళ్లి కూడా చేసుకోలేదని.. ఇండస్ట్రీలో ఆడవాళ్లను ఏనాడు పరుష మాటలు కానీ, తప్పుడు మాటలు మాట్లాడటం కానీ ఇంత వరకు  చేయలేదని అలాంటిది తనను అల్లరి చేయడంతో సూసైడ్ చేసుకుంటే బెటర్ అనిపించిందని అన్నారు. ఇన్నాళ్లు నిప్పులా బతికానని.. సోషల్ మీడియా అనే దరిద్రం వచ్చి తనకున్న మంచి పేరుని చెడగొట్టిందని అన్నారు.