సినిమా ఫెయిలైతే నిజాయితీగా ఒప్పుకునే వారు ఎంతమంది ఉంటారు. కానీ కార్తికేయ మాత్రం అందులో దాచాల్సిందేమీ లేదన్నట్లు తన లేటెస్ట్ చిత్రం ఆడలేదని చెప్పేసారు. కార్తికేయ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన విభిన్న ప్రేమకథా చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ అందుకుంది. కాగా, శుక్రవారం నుంచి ‘చావుకబురు చల్లగా’ చిత్రం ఆహా ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఓ ప్రెస్‌మీట్‌లో చిత్ర టీమ్ పాల్గొంది. ఓటీటీ కోసం తమ చిత్రాన్ని రీఎడిట్‌ చేసినట్లు చిత్ర దర్శకుడు కౌశిక్‌ తెలిపారు.

 కార్తికేయ మాట్లాడుతూ..‘‘చావు కబురు చల్లగా’ నా మనసుకి బాగా దగ్గరైన సినిమా. మా సినిమా కమర్షియల్‌గా అనుకున్నంత బాగా ఆడనందుకు మొదటి మూడు రోజులు చాలా బాధపడ్డా. ఆ తర్వాత మా సినిమా చూసిన వాళ్లనుంచి వచ్చిన ప్రశంసలు కొంత ఊరటనిచ్చాయి. అలాగే బాలరాజు పాత్ర చేయగలనని నమ్మి.. ఈ సినిమాలో నటించే అవకాశాన్ని కల్పించిన దర్శకుడు కౌశిక్‌, నిర్మాతలు బన్నీవాసు, అల్లు అరవింద్‌కి నా కృతజ్ఞతలు. 

ప్రతి కథకు మనం నూరు శాతం కష్టపడతాం. కానీ, హిట్టు, ఫ్లాప్‌ అనేది మన చేతుల్లో ఉండదు. ఇప్పటివరకూ కార్తికేయ అంటే మంచి ఫిజిక్‌, రొమాంటిక్‌ సీన్స్‌ బాగా చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా తర్వాత విభిన్నమైన కథలు నా దగ్గరకు వస్తున్నాయి. నా కెరీర్‌ ఇప్పుడే ప్రారంభమైంది. కాబట్టి హిట్టు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా విభిన్నమైన పాత్రలు చేయాలనుకుంటున్నా. అలాగే, కౌశిక్‌ చెప్పినట్లు.. ఓటీటీ కోసం ‘చావు కబురు చల్లగా’ చిత్రాన్ని రీ ఎడిట్‌ చేశాం. మీకు నచ్చితే మేము ఎంతో సంతోషిస్తాం.’’ అని కార్తికేయ అన్నారు.