కొద్దిరోజుల క్రితం పుల్వామాలో నలభై మందికి పైగా జవాన్లు ఉగ్రదాడి కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంది ఇండియన్ ఆర్మీ. మంగళవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడులు నిర్వహించింది. 

ఈ దాడిలో రెండు వందల నుండి మూడు వందల మంది తీవ్రవాదులు హతమయ్యుంటారని భావిస్తున్నారు. ఈ దాడుల్లో జైషే మహ్మద్ కి చెందిన పలువురు అగ్రనేతలు కూడా చనిపోయి ఉంటారని అనుకుంటున్నారు.

ఈ క్రమంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు భారతీయులు. సినిమా సెలబ్రిటీలు సైతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో సర్జికల్ స్ట్రైక్ 2 అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ బ్రావో ఇండియా అంటూ ట్వీట్ చేయగా.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్ లో 'ఏయ్ పాకిస్తాన్, నువ్వు ఒకటి కొడితే మేం నాలుగు కొడతాం' అంటూ ట్వీట్ చేశాడు.

వర్మ శిష్యుడు పూరి కూడా తనదైన స్టైల్ లో 'బుల్లెట్టు దిగిందా లేదా..?' అనే డైలాగ్ ని పోస్ట్ చేస్తూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి వందనం చేశాడు.