బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాలను నిర్మిస్తున్న ‘మైత్రీ  మూవీ మేకర్స్’పై తాజాగా కేసు నమోదైంది. ఓ వ్యక్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేసి  దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. 

నేచురల్ స్టార్ నాని (Nani), మలయాళం బ్యూటీ నజ్రియా ఫహద్ (Nazriya Fahad) జంటగా నటించిన చిత్రం ‘అంటే సుందరానికీ’. ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరించేందుకు నాని నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ నిన్న (జూన్ 10) రిలీజ్ అయ్యింది. ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. హీరో నాని ఓ సాలిడ్ కొట్టి చాలా కాలం అవుతుంది. శ్యామ్ సింగరాయ్ పర్వాలేదనిపించగా... టక్ జగదీష్, వి, గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. భలే భలే మగాడివోయ్ తర్వాత ఆ స్థాయి హిట్ పడకపోయినా.. ఓ భిన్నమైన జోనర్ లో ప్రయోగాత్మకంగా ‘అంటే సుందరానికీ’తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు నాని.

ఈ చిత్రాన్ని ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ ‘మైత్రీ మూవీ మేకర్స్’ వారు నిర్మించారు. సినిమాను మంచి అవుట్ పుట్ తో ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చారు. అంతకుముందు చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా జూన్ 9న సాయంత్రం హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ ను శ్రేయాస్ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో కొనసాగింది. కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చీఫ్ గెస్ట్ గా హాజరుకావడంతో.. ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ‘అంటే సుందరానికీ’ ఈవెంట్ ను విజయవంతం చేశారు.

అయితే, ఓ వ్యక్తి మాత్రం ‘అంటే సుందరానికీ’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణలో ఆర్గనైజర్ శ్రేయాస్ మీడియా మరియు మైత్రీ మూవీ మేకర్స్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతమంది అభిమానులు తరలివచ్చిన ఈవెంట్ లో కోవిడ్ ఆంక్షలను పాటించలేదని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సదరు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు కోవిడ్ కేసులు కూడా క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే మళ్లీ మాస్క్ మస్ట్ అనే నిబంధన అమల్లోకి వచ్చింది.