బాలీవుడ్ బ్యూటీ అమీషాపటేల్ తెలుగులో 'బద్రి' అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఫోటోషూట్లతో కాలం గడుపుతోంది. ఇప్పుడు ఈ భామకి కోర్టు కేసు మెడకు చుట్టుకుంది. ఓ ఫైనాన్షియర్ నుండి మూడు కోట్ల రూపాయలు అప్పు ఎగవేసినందుకు ఆమెకు కోర్టు సమాన్లు జారీ చేసింది.

ఇందులో చెక్ బౌన్స్ కేసు కూడా లింక్ అయి ఉండడంతో అమీషా మరింత ఇబ్బందుల్లో పడింది. ఓ సినిమా కథ నచ్చడంతో తనే నిర్మాతగా మారి సినిమా తీయడానికి సిద్ధమైంది అమీషా.. దీనికోసం అజయ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి దగ్గర మూడు కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది.

కొన్ని కారణాల వలన సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీంతో ఫైనాన్షియర్ ఒత్తిడి చేయడంతో అతడికి చెల్లని చెక్కు ఇచ్చింది అమీషా.. దీంతో సదరు ఫైనాన్షియర్ ఆమెపై కేసు వేశాడు. రాంచీ కోర్టులో కేసు ఫైల్ అయింది. ఈ నెల 8న ఆమె కోర్టుకి హాజరు కావాలి.. లేదంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తారు. తనకు రావాల్సిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని.. ఇప్పుడు చెల్లించకపోతే ఎప్పటిలోపు చెల్లిస్తారో బాండ్ రాసి ఇవ్వాలని అజయ్ కుమార్ సింగ్ అంటున్నారు.

ఈ విషయంపై స్పష్టత కోరిన ప్రతీసారి అమీషా తప్పించుకొని తిరుగుతుందని అజయ్ కుమార్ ఆరోపణలు చేశారు. అయితే అమీషా మాత్రం తను ఎక్కడకి పారిపోలేదని.. ముంబైలోనే ఉన్నానని చెబుతోంది.