గత వారం గోవా బీచ్‌లో న్యూడ్‌గా ఫోటో షూట్‌ నిర్వహించి వివాదాల్లో ఇరుక్కుంది బాలీవుడ్‌ నటి, మోడల్‌ పూనమ్‌ పాండే. ఆమెపై కేసు నమోదు అయ్యింది. ఇక ఇటీవల బాలీవుడ్‌ నటుడు, మోడల్‌ మిలింద్‌ సోమన్‌ తన పుట్టిన రోజు సందర్బంగా గోవా బీచ్‌లో న్యూడ్‌గా పరిగెత్తాడు. అది క్రేజీగా మారింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఇదే ఇప్పుడు మిలింద్‌ని వివాదాల్లోకి నెట్టింది. న్యూడ్‌గా ఆయన పరిగెత్తడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. గో సూరక్ష మంచ్‌ అనే ఓ సంస్థ మిలింద్‌పై కేసు పెట్టారు. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 67, ఐపీసీ సెక్షన్‌ 294 కింద మిలింద్‌పై కొల్వా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు దక్షిణ గోవా ఎస్పీ పంకజ్‌ సింగ్‌ తెలిపారు. 

ఆ వెంటనే మిలింద్‌కి బెయిల్‌ మంజూరు చేసింది కోర్ట్. వీడియోలు, చిత్రాలు, ప్రొఫెషనల్‌ షూట్‌ వారి వారి వ్యక్తిగత విషయాలైనప్పటికీ, ఏదైనా అభ్యంతరం వ్యక్తమయితే, ప్రజా ఆగ్రహం వ్యక్తమైతే తప్ప అశ్లీల, అనైతికమైనవిగా చెప్పలేమని, భావ వ్యక్తీకరణ రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కు అని బెయిల్‌ ఉత్తర్వులో జ్యూడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కెనకోనా తెలిపారు. 

మిలింద్‌ గతంలోనూ ఇలాంటి వివాదాలు ఎదుర్కొన్నారు. నటి మధు సాప్రేతో కలిసి కండోమ్‌ యాడ్‌లో కొండచిలువని చుట్టుకుని న్యూడ్‌గా పోజులిచ్చారు. ఇది వివాదమై కేసు అయ్యింది. 14ఏళ్ల విచారణ అనంతరం వీరిని నిర్ధోషులుగా కోర్ట్ తీర్పునిచ్చింది.