తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు నిర్మాతలకి, విశాల్ కి మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదం ముదరడంతో పోలీసులు విశాల్ ని అదుపులోకి తీసుకున్నారు.

అసలు విషయంలోకి వస్తే.. విశాల్ పై అసంతృప్తితో కొందరు నిర్మాతలు ఆయనకి ఎదురు తిరిగారు. విశాల్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చర్యలు నిర్మాతలకు నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయనని అధ్యక్ష పదవి నుండి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

బుధవారం నాడు స్థానిక టి.నగర్ లోని నిర్మాతల మండలి కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. ప్రస్తుతం ఉన్న కార్యవర్గాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు జరపాలని, లేదంటే తామే ఓ కమిటీగా నిర్మాతల మండలి పనులు చూసుకుంటామని హెచ్చరించారు.

అయితే గురువారం నాడు నిర్మాతల మండలి కార్యాలయానికి వేసిన తాళాన్ని పగులగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు విశాల్. దీంతో ఒక్కసారిగా అక్కడి వివాదం మరింత రాజుకుంది. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు విశాల్ ని అరెస్ట్ చేశారు. 
 

కదులుతున్న విశాల్ సీటు.. సీఎంకు పిర్యాదు?