ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కు సంక్రాంతి రోజు  బైపాస్ ఆపరేషన్ జరిగిందని మీడియా వర్గాల సమాచారం. ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ లో  ఈ సర్జరీ చేసారు. ఆదివారం ఆయన అనారోగ్యంగా ఉండటం, గాలి తీసుకోవటం ఇబ్బంది అనిపించటంతో  వైద్యుల సూచన మేరకు , ముంబై ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కు తీసుకువచ్చి జాయిన్ చేసారు. 

నిన్న ఉదయం ఆ హాస్పటిల్ లోని ప్రముఖ  కార్డియాక్ సర్జన్ రామకుంట పాండ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్  నిర్వహించారు. ఆపరేషన్  సక్సెస్ అయ్యింది. ఆయన మెల్లగా కోలుకుంటున్నారు.  డాక్టర్ల అబ్జర్వేషన్ కోసం ఓ వారం రోజులు పాటు హాస్పటిల్ లో ఉండమన్నట్లు తెలుస్తోంది. 

62 సంవత్సరాల బ్రహ్మానందంని  ఆయన కుమారులు రాజా గౌతమ్, సిద్దార్ద  హాస్పటిల్ లో కనిపెట్టుకుని ఉన్నారని చెప్తున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన కానీ, సమాచారం కానీ అందుబాటులో లేదు. 

హాస్య బ్రహ్మాగా పేరుపొంది, ఒక దశాబ్దం పాటు దాదాపు విడుదలైన ప్రతి తెలుగు సినిమాలోనూ కనిపించి నవ్వుల్ని పండించారు బ్రహ్మానందం. ఆయన కు ఈ మధ్య సినిమా అవకాశాలు బాగా తగ్గాయి.  కొన్ని సినిమాల్లో మాత్రమే ఆయన కనిపిస్తున్నారు.  దర్శకులు, రచయితలు ఆయన కోసం ప్రత్యేకంగా పాత్రలు రాయడం తగ్గించేశారు . రీసెంట్ గా ఎన్టీఆర్ కధానాయకుడులో ..రేలంగి పాత్రలో కనిపించారు. దాదాపు వెయ్యికు పైగా సినిమాల్లో నటించిన ఆయన సౌతిండియాలో టాప్ కమిడియన్ గా వెలిగారు.