బుల్లితెరపై ఎన్ని కామెడీ షోలు వస్తున్నా.. 'జబర్దస్త్'ని ఏ కామెడీ షో బీట్ చేయలేకపోతుంది. ఎలాంటి కామెడీ షో వస్తున్నా.. వెంటనే 'జబర్దస్త్'తో పోల్చడం అందరికీ అలవాటుగా మారింది. ఆ షోలో పడే పంచ్ లు, కామెడీ మరే షోలో కనిపించవని అందరి భావన. అయితే దానిపై కూడా చాలా వివాదాలు జరిగాయి. షోలో బూతులు ఎక్కువవుతున్నాయని కొందరు సామాజిక కార్యకర్తలు ఈ షోపై కేసులు కూడా వేశారు.

తాజాగా స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఈ షోపై పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రస్తుతం ఓ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లో ప్రసారమవుతున్న స్టాండప్ కామెడీకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు బ్రహ్మానందం. ఈ షోకి ఆడియన్స్ నుండి పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. దీంతో అటు ప్రేక్షకులకి ఇటు జబర్దస్త్ వంటి షోలకి పంచ్ వేస్తూ బ్రహ్మీ కొన్ని కామెంట్స్ చేశారు.

''చక్కగా అందరికీ ఆనందాన్ని కలిగించే కామెడీ ప్రోగ్రామ్ ఇది.. ఏ రకమైన ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా అందరూ టీవీ ముందు కూర్చొని చూడాలని అనుకోవాలి.. కొంచెం మనం వెజిటేరియన్ తినడం అలవాటు చేసుకుంటే నాన్ వెజిటేరియన్ తినడానికి పెద్దగా ఇంటరెస్ట్ చూపించం.. జెనరెల్ గా అదే జరుగుతుంటుంది.

దాన్ని అలవాటు చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది..'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక్కడ నాన్ వెజిటేరియన్ అంటే జబర్దస్త్ వంటి షోలని పరోక్షంగా చెప్పుకొచ్చాడు బ్రహ్మీ. అందరూ హెల్తీగా ఉండాలని, వెజిటేరియన్ కామెడీ అలవాటు చేసుకోవాలని అన్నారు.