కోట శ్రీనివాసరావు మరణాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ హాస్యనటుడు బ్రహ్మానందం, బాబూ మోహన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.
మహానటుడు కోట శ్రీనివాసరావు ఈ రోజు ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు సినీ ప్రముఖులు.
కోట శ్రీనివాసరావు భౌతికకాయానికి నివాళ్లు అర్పించిన సినీ, రాజకీయ ప్రముఖులు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, చిరంజీవి, వెంకటేష్, త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, రాజేంద్రప్రసాద్, రానా, శ్యామలా దేవి, శేఖర్ కమ్ముల, సురేష్ బాబు, అల్లు అరవింద్‌తోపాటు అనేక మంది తారలు, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళ్లు అర్పించారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందం, బాబూమోహన్ మీడియాని ఉద్దేశించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు.
కోటని గుర్తు చేసుకుంటూ బ్రహ్మానందం కన్నీళ్లు
హాస్యనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ, కోట శ్రీనివాస రావు మహానటుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక దశకంలో నేనూ, కోట శ్రీనివాసరావు, బాబూమోహన్ ప్రతి సినిమాలోనూ ఉండేవాళ్లం. రోజుకి 18 గంటలు పనిచేసేవాళ్లం.
గత నలబై ఏళ్లుగా కలిసి నటిస్తూ వస్తున్నామ`ని చెబుతూ బోరున విలపించారు బ్రహ్మానందం. `అరేయ్, ఒరేయ్ అంటుండేవారు. అలాంటి కోట లేడు అంటే నమ్మలేకపోతున్నా. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు.
ఆయన నటనరాజపుత్రుడు, మహానుభావుడు ఏ విషయంలోనైనా నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి. అలాంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు` అంటూ మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నారు బ్రహ్మానందం.
కోటన్న నేను ఎప్పుడూ కలిసినా అవే సెటైర్లుః బాబూ మోహన్
కోట శ్రీనివాసరావు బెస్ట్ ఫ్రెండ్ అయిన నటుడు బాబూ మోహన్ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. కోట భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు బాబూ మోహన్.
`ఈ రోజు చాలా దురదృష్టకరమైన రోజు. రెండు రాష్ట్రాల ప్రజల కంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న. సినిమాల్లోనే కాదు, బయట మేం కలిసినప్పుడు కూడా, ఫోన్‌లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ సెటైర్లు సినిమాల్లో మాదిరిగానే వేసుకుంటాం. అంతే సరదాగా మాట్లాడుతుంటాడు కోటన్న. ఆ చాల్లేవాయ్ అంటూ సెటైర్లతో నవ్విస్తుంటారు.
ఇంటికి రమ్మన్నాడు, నేను వస్తే ఆయన లేడుః బాబూ మోహన్
మొన్ననే ఫోన్ చేశాను. ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నావ్ రా అన్నాడు. షూటింగ్‌లో ఉన్నా అంటే ఎప్పుడొస్తావ్ అన్నాడు. రేపు వస్తానని చెప్పాను. అప్పుడు చాలా బాగా మాట్లాడాడు.
రెండు నిమిషాలు ఆ సెటైర్లతోనే మాట్లాడుకున్నాం, ఆ తర్వాత షూటింగ్‌లోకి వెళ్లిపోయాను. మళ్లీ సాయంత్రం ఫోన్ చేస్తే పడుకున్నారని చెప్పారు. రేపు వస్తానని చెప్పాను. రమ్మని చెప్పాడట. కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండీ` అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు బాబూ మోహన్.
అన్నంముద్దలు కలిపి పెట్టేవాడు.. కోటని గుర్తు చేసుకుని బాబూమోహన్ ఎమోషనల్
ఆయన ఇంకా మాట్లాడుతూ, ఇంటికి వస్తే ఎంతో సంతోషంగా ఫీలయ్యేవాడు. రా రా బోర్ కొడుతుందిరా అనేవాడు. ఇప్పుడేమో హాయిగా పడుకున్నాడు. సొంత అన్నదమ్ముల మాదిరిగానే ఉన్నాం.
కోటన్నకి ఒక తమ్ముడు ఉన్నాడు, కానీ నన్నే అసలు తమ్ముడిగా ఫీలయ్యేవాడు. ఎన్నోసార్లు ఒకే ప్లేట్‌లో భోజనం చేశాం. అన్నంముద్దలు కలిపిపేట్టేవాడు, హే తినవోయ్ అనేవాడు.
ఎక్కడైనా ఔట్ డోర్ కి వెళితే, పక్క పక్కనే రూమ్‌లు తీసుకునేవాళ్లం. రూములు వేరైనా ఒకే రూమ్‌లో ఉండేవాళ్లం. ఇలాంటివి ఎన్నో సందర్భాలున్నాయి. మా మధ్య అనుబంధం మాటలకు అందనిది, ఆయన ఆత్మకి శాంతికలగాలి` అని తెలిపారు బాబూ మోహన్.
కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబూ మోహన్ కలిసి వందల సినిమాల్లో నటించారు. వీరి మధ్య కామెడీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ఈ త్రయం నుంచి ఒకరు వెళ్లిపోవడం బాధాకరం.