టాలీవుడ్ లో వారసులకు కొదవ లేదనే చెప్పాలి. ఇప్పటివరకు ఇండస్ట్రీ నుండి చాలా మంది వారసులు నటులుగా పరిచయమయ్యారు. కానీ కొద్దిమంది మాత్రమే క్లిక్ అయ్యారు. ఇప్పుడు మరో వారసుడు సినీ రంగప్రవేశానికి సిద్ధమవుతున్నాడు.

ప్రముఖ తెలుగు కమెడియన్ బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ గా చేసిన సంజయ్ ఇప్పుడు హీరోగా పరిచయం కాబోతున్నాడు. సినిమా షూటింగ్ కూడా మొదలైంది.

ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇక్కడి షెడ్యూల్ పూర్తయిన వెంటనే అమలాపురం వెళ్లనుంది. అక్కడ మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఆ షెడ్యూల్ పూర్తయిన తర్వాత సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం అందుతోంది.

ఈ సినిమాలో బ్రహ్మాజీ కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. నిత్యా శెట్టి హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఆనంద్ ప్రసాద్ తన భవ్య క్రియేషన్స్ లో నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రంతో చందు మొద్దు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.