నందమూరి బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన తదుపరి సినిమా బోయపాటితో ఉంటుందని అనౌన్స్ చేశారు. అన్నీ ఓకే అనుకున్న తరువాత ఈ ప్రాజెక్ట్ వాయిదా పడింది. బోయపాటి స్థానంలో దర్శకుడు కె.ఎస్.రవికుమార్ వచ్చాడు. బాలకృష్ణ ముందుగా రవికుమార్ సినిమా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు.

సెప్టెంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా పూర్తయ్యేలోపు బోయపాటి మరో హీరోతో సినిమా చేస్తాడని అనుకున్నారు. గతంలో అఖిల్ కోసం స్క్రిప్ట్ రెడీ చేశాడు ఈ దర్శకుడు. డైలాగ్ వెర్షన్ తో సహా బౌండెడ్ స్క్రిప్ట్ పెట్టుకున్నాడు.

కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు దాన్ని లైన్ లోకి తీసుకొచ్చే ఛాన్స్ వచ్చింది. అఖిల్-బోయపాటిల మధ్య కథాచర్చలు కూడా జరిగాయి. నిర్మాతలు కూడా ముందుకొచ్చారు. కానీ బోయపాటి మాత్రం ఇప్పటిలో ఈ ప్రాజెక్ట్ వద్దని చెబుతున్నాడట.

బాలయ్య కోసం స్క్రిప్ట్ తయారు చేసే పనిలో ఉన్నానని, ఆలస్యమైనా బాలయ్య సినిమానే చేస్తానని ఈలోగా మరో సినిమా జోలికి పోనని చెప్పాడట. మరి బాలయ్య కోసం ఎదురుచూస్తున్న బోయపాటి ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి!