శ్రీదేవి మ‌ర‌ణం ఇప్పటికీ ఒక తేలని మిస్టరీనే. ఆమె బాత్‌ ట‌బ్బులో ప‌డి మ‌ర‌ణించింద‌నేది అధికారికంగా చెప్పినా  ఆమె మ‌ర‌ణంపై ఎన్నో అనుమానాలున్నాయి. అయితే ఈ విషయాన్ని క్యాష్ చేసుకోబోతున్నారా ..ఓ సినిమా తీసి అనిపించేలా ఒక మూవీ వ‌స్తోంది. అదే శ్రీదేవి బంగ్లా. ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తోంది..ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌ కావటంతో ప్రాజెక్టుకు క్రేజ్ వచ్చింది.  టైటిల్‌తోనే సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు టీజర్‌లో శ్రీదేవి బాత్‌టబ్‌లో పడిపోయి చనిపోయిన ఘటన గుర్తు చేసేలా ప్రియా వారియర్‌ కూడా సినిమాలో అలాగే చనిపోవడాన్ని చూపించారు. దాంతో సినిమా వివాదంలో చిక్కుకుంది. 

ఇప్పటికే శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ దర్శకుడికి, నిర్మాతకు నోటీసులు పంపారు. కానీ, ఈ నోటీసులపై వారు స్పందించలేదు. దాంతో సినిమా విడుదలను ఆపేందుకు బోనీ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ‘సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ చూసినప్పుడే బోనీ కపూర్‌ చిత్రం టీమ్ కి నోటీసులు పంపారు. కానీ, వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దాంతో మరింత కఠిన చర్యలు తీసుకోవాలని బోనీ నిర్ణయించుకున్నారు. సినిమాలో ఏ సీన్ లనును చూపించాలన్నది వారి ఇష్టం. కానీ టైటిల్‌లో మాత్రం శ్రీదేవి పేరు ఉండకూడదు’ అని బోనీ పట్టుబడుతున్నారు. 

మరో ప్రక్క ఈ సినిమాపై వివాదాలు ఉన్నప్పటికీ సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు, నిర్మాత అర్బాజ్‌ ఖాన్‌ ఇందులో గెస్ట్ రోల్ లో నటించేందుకు అంగీకరించారు. సినిమాకు, శ్రీదేవికి ఎలాంటి సంబంధం లేదని తెలుసుకున్నాకే నటించేందుకు అంగీకారం తెలిపానని ఆయన పేర్కొన్నారు.