బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రియురాలు రియా చక్రవర్తికి బెయిల్‌ మంజూరైంది. 

బుధవారం మహారాష్ట్ర(బాంబే) హైకోర్ట్ బెయిల్‌ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్‌పై రియాకు బెయిల్‌ ఇచ్చారు. ఇదిలా ఉంటే రియాకి బెయిల్‌ రాగా, ఆమె సోదరుడు షోయిక్‌, అబ్డేల్‌ బాసిత్‌ పరిహర్‌కి బెయిల్‌ పిటిషన్‌ని హైకోర్ట్ నిరాకరించింది. వీరితోపాటు సుశాంత్‌ వంటమనిషి దీపేష్‌ సావత్‌, సామ్యూల్‌ మిరాండలకు సైతం యాభై వేల పూచికత్తుపై బెయిల్‌ ఇచ్చింది హైకోర్ట్. 

ముంబయిలోని డ్రగ్‌ మాఫియాతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో సెప్టెంబర్‌8న సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమె సోదరుడు సోయిక్‌ని సెప్టెంబర్‌ 4న అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఆ సమయంలోనే రియా ప్రత్యేక కోర్ట్ తన బెయిల్‌ కోసం పిటిషన్‌ పెట్టుకోగా, కోర్ట్ తిరస్కరించింది. అంతేకాదు ఆమెపై కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగించింది.

ఈ నేపథ్యంలో రియా బాంబే హైకోర్ట్ ని ఆశ్రయించింది రియా. వాదోపవాదనల అనంతరం లక్ష రూపాయల వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్‌ని మంజూరు చేసింది హైకోర్ట్. సుశాంత్‌ కేసులో రియా ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో బాలీవుడ్‌ డ్రగ్స్ కేసులోనూ ఆమె పేరు ప్రముఖంగా వినిపించింది. దీంతో ఎన్‌సీబీ ఆమెని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.