జుడ్వా సినిమా ట్రైలర్ ను పొగుడుతూ అఖిల్ ట్వీట్ హలో బ్రదర్ తన ఫేవరైట్ సినిమాల్లో ఒకటన్న అఖిల్ అఖిల్ హలో బ్రదర్ అంటాడేంటంటూ హిందీ జనం ట్రోలింగ్ అసలు విషయం తెలియక అమాయకంగా ట్రోల్ చేసిన బాలీవుడ్ ప్రేక్షకులు
హలోబ్రదర్ టాలీవుడ్ లో నాగార్జున డ్యుఎల్ రోల్ లో వచ్చిన సినిమా అప్పట్లో మంచి హిట్ నే రాబట్టింది. తర్వాత సల్మాన్ ఖాన్, కరీష్మా కపూర్, రంభ జంటగా హిందీలో సల్మాన్ హీరోగా జుడ్వా పేరుతో రీమేక్ చేసారు. ఇప్పుడు అదే మూవీకి కొనసాగింపుగా వస్తున్నది జుడ్వా2. అయితే.. ఈ మూవీలో హీరోగా వరుణ్ ధావన్ నటిస్తుండగా.. హీరోయిన్లుగా జాక్వెలిన్, తాప్సీ నటిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.
వరుణ్ ధావన్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు ఈ మూవీలో. సాజిద్ నదియావాలా ఈ మూవీకి ప్రొడ్యూసర్. దేవిడ్ ధావన్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. వచ్చే దసర కానుకగా సెప్టెంబర్ 29 న మూవీ రిలీజ్ అవనుంది. ‘జుడ్వా' ట్రైలర్ చూసి నాగార్జున చిన్న కొడుకు అఖిల్ స్పందిస్తూ.. ఈ ట్రైలర్ తనకు బాగా నచ్చిందని, తనకు ‘హలో బ్రదర్' చాలా నచ్చిన సినిమా అని ట్వీట్ చేశాడు. ఐతే బాలీవుడ్ జనాలకు అసలు విషయం అర్థం కాలేదు.
‘హలో బ్రదర్' అంటే ‘జుడ్వా' ఒరిజినల్ అని తెలియక.. ‘జుడ్వా' వచ్చిన కొన్నేళ్ల తర్వాత సల్మాన్ నటించిన ‘హలో బ్రదర్' అనే సినిమా ప్రస్తావన తెచ్చారు. అయితే ఆ హలో బ్రదర్ వేరు ఈ విషయం మనకు తెలుసు గానీ వాళ్ళకి తెలీదు కదా. అందుకే.. ‘జుడ్వా-2' సినిమా ‘జుడ్వా'కు సీక్వెల్ అని.. ‘హలో బ్రదర్'కు కాదని.. అఖిల్ తప్పులో కాలేశాడని హిందీ జనాలతో పాటు సెలబ్రెటీలు కూడా అతణ్ని ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఓ నేషనల్ వెబ్ సైట్ అయితే దీని మీద ఒక స్టోరీ కూడా అల్లేసి.. పబ్లిష్ చేసింది. అఖిల్‌కు పాపం ‘జుడ్వా' గురించి అవగాహన లేదన్నట్లుగా మాట్లాడింది.
ఐతే ఈ వార్త చూసి మన లోకల్ జనాలకు మండిపోయింది. ముందు తెలుగు సినిమా మీద చిన్న చూపు మాని.. ఇక్కడి సినిమాల గురించి తెలుసుకోండని.. ‘బాహుబలి' వచ్చి బాలీవుడ్ సినిమాలకు దిమ్మదిరిగే షాకిచ్చాక కూడా తీరు మారలేదని కౌంటర్లు వేశారు మన తెలుగు నెటిజన్లు.
