పుల్వామాలో ఆత్మాహుతి దాడులకు తెగబడ్డ పాక్ ఉగ్రవాదులు దాదాపు 40 మంది భారత జవానులని పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకే ఇండియా వ్యూహాత్మకంగా సంచలన నిర్ణయం తీసుకుంది. భారత వాయుసేన దళాలు మిరాజ్ యుద్ధ విమానాలతో పీవోకేని దాటి బాలాకోట్ లోకి ప్రవేశించాయి. 

అక్కడ జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాల టార్గెట్ గా బాంబుల వర్షం కురిపించాయి. జైషే ఉగ్ర స్థావరాల నేలమట్టం చేశాయి. బాలాకోట్ దాడుల నేపథ్యంలో వెండితెరపై చిత్రం రూపొందబోతోంది. క్రేజీ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించబోతున్నారు. ఈ విషయాన్ని వివేక్ స్వయంగా వెల్లడించారు. 

అందుకు కావాల్సిన అనుమతులని వివేక్ ప్రభుత్వం నుంచి పొందారట. ఈ చిత్ర టైటిల్ 'బాలాకోట్ - ది ట్రూ స్టోరీ'. పుల్వామా ఘటన తర్వాత భారత ప్రభుత్వం రచించిన వ్యూహాలు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాలు చూపించిన ధైర్య సాహసాలని ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారు. 

ఓ భారతీయుడిగా ఇండియన్ ఆర్మీ శక్తి సామర్థ్యాలని ప్రజలకు చూపించడం నా బాధ్యత. పుల్వామా ఘటన మొదలుకుని, బాలాకోట్ దాడులు, కమాండర్ అభినందన్ చూపించిన ధైర్యం ఇలా ప్రతి విషయంలో వాస్తవాలని ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నాం అని వివేక్ వివరించాడు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు అనుమతినిచ్చిన వాయుసేనకు, ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు అని వివేక్ తెలిపాడు.