ఎట్టకేలకు మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ హాట్ బ్యూటీ.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు ఊరట లభించింది. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె కోర్టు తీర్పుతో ఊపిరిపీల్చుకుంది.
బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు ఢిల్లీ కోర్టు లో భారీ ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసు లో ఆరోపణలు ఫేస్ చేస్తున్నా జాక్వెలిన్ ఎలాంటి ముందస్తు అనుమతి అవసరం లేకుండా తన పని మీద తాను విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఈ మేరకు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు ఆమెకు ఇప్పటి వరకూ ఉన్న బెయిల్ షరతులను సవరించింది. ఈ నిర్ణయంతో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సంతోషం వ్యక్తం చేసింది.
గత కొంత కాలంగా ఈకేసులో ఇబ్బంది పడుతుంది జాక్వెలిన్. 200కోట్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ సంబంధాలు కలిగి ఉందన్న నెపంతో జాక్వెలిన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిందితురాలిగా చేర్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేయగా.. గతేడాది నవంబర్‌లో కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదనన్న నియమంతో పాటు.. మరికొన్ని షరతులు కోర్టు పేర్కొంది. విదేశాలకు వెళ్లడానికి మూడు రోజుల ముందు ఈడీకి సమాచారం ఇవ్వాలని పేర్కొంది. తన పర్యటనకు సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలని ఆదేశించింది. అందులో ఆమె వెళ్లే దేశం, బస చేసే ప్రదేశం, సంప్రదింపు నంబర్, ఎన్నిరోజులు అక్కడ ఉంటారు..? వంటి ఇతర వివరాలను ముందుగానే కోర్టుకు సమర్పించాలని అప్పట్లో తీర్పు వెల్లడించింది.
అయితే తాను నటిని కావడంతో షూటింగ్స్ కోసం సడెన్ గా ఫారెన్ కు వెళ్లాల్సి వస్తోందని.. అప్పుడు సమయం తక్కువగా ఉండటంతో తాను ముందస్తు అనుమతి తీసుకోవడం కుదరడంలేదని.. దాని వల్ల తాను సినిమాలు కోల్పోవలసి వస్తుదంటూ.. జాక్వెలిన్ కోర్టుకు విన్నవించింది. కొన్నిసార్లు తక్కువ సమయంలోనే విదేశాలకు వెళ్లేందుకు ఒప్పుకోవాల్సి వస్తోందని, లేదంటే వృత్తిపరమైన అవకాశాలను కోల్పోతానని తెలియజేసింది. దాంతో జాక్వెలిన్ పిటీషన్ ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. గతంలో ఇచ్చిన మినహాయింపులను జాక్వెలిన్ దుర్వినియోగం చేయలేదని గుర్తించింది. ఈ మేరకు ఆమె బెయిల్ షరతుల్లో మార్పులు చేయాలని నిర్ణయించింది.
