బాలీవుడ్‌ సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా ఇండస్ట్రీలో వేల కోట్ల నష్టాలను చవిచూస్తుండగా అదే సమయంలో వరుస విషాదాలు ఇండస్ట్రీని కలవరపెడుతున్నాయి. లాక్‌ డౌన్‌ సమయంలోనే బాలీవుడ్‌ సినీ పరిశ్రమం ఎంతో మంది ప్రముఖులను కోల్పోయింది. ఇర్ఫాన్‌ ఖాన్‌, రిషీ కపూర్‌, వాజిద్‌ ఖాన్‌, జగదీప్‌ లాంటి సీనియర్‌ స్టార్‌లతో పాటు యువ నటులు కూడా మరణించారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకొని మరణించటం ఇండస్ట్రీని కుదిపేసింది. టీవీ, సినీ నటుడు రాజన్‌ సెహగల్‌, నటి మోడల్‌, దివ్య చోక్సీ లాంటి వారి ఆకస్మిక మృతితో ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు రజత్‌ ముఖర్జీ అనారోగ్యంతో మృతి చెందారు. రామ్‌ గోపాల్ వర్మ నిర్మాతగా తెరకెక్కిన రోడ్ సినిమాతో రజత్‌కు దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది.

ఆయన మృతిపై మనోజ్ బాజ్‌పాయ్‌ సహా పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలిపారు. రజత్‌.. ప్యార్‌ తూనే క్యా కియా, లవ్‌ ఇన్‌ నేపాల్, ఇష్క్‌ కిల్స్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. కొద్ది రోజులుగా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న ఈ సీనియర్‌ దర్శకుడు జైపూర్‌లోని తన నివాసంలో ఆదివారం మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు.