మహిళను లైంగిక వేధింపుల కేసులో బాలీవుడ్‌ నటుడు విజయ్‌ రాజ్‌ని మధ్య ప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌, గోండియాలోని హోటల్‌ గేట్‌ వే లో ఓ చిత్రం షూటింగ్‌ జరుగుతున్న సమయంలో తనని విజయ్‌ రాజ్‌ వేధించాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నటుడు విజయ్‌ రాజ్‌ని అరెస్ట్ చేశారు. 

విజయ్‌ రాజ్‌ నటిస్తున్న `షెర్ని` చిత్ర షూటింగ్‌ టైమ్‌లో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా చిత్ర యూనిట్‌లో మహిళే బాదితురాలు కావడం గమనార్హం.  దీంతో విజయ్‌ రాజ్‌పై ఐపీసీ సెక్షన్‌ 354ఏ, డి కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ వెంటనే ఆయన్ని గోండియాలోని స్థానిక కోర్ట్ లో హాజరు పర్చగా కోర్ట్‌ విజయ్‌ రాజ్‌కి బెయిట్‌ ఇచ్చింది. 

విజయ్‌రాజ్‌ `భోపాల్‌ ఎక్స్ ప్రెస్‌` చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యారు. పలు సినిమాల్లో హీరోగానూ నటించారు. `జంగిల్‌`, `మాన్‌ సూన్‌ వెడ్డింగ్‌`, `ఆక్సు`, `కంపెనీ`, `లాల్‌ సలాం`, `రోడ్‌`, `రన్‌`, `ధమాల్‌`, `డ్రీమ్‌ గర్ల్`, `గల్లీబాయ్‌`, `గులాబో సీతాబో` చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. ఆయన కామెడీకి మంచి పేరుంది.