బాలీవుడ్ సీరియల్ నటుడు ప్రిన్స్ నరులా ఇటీవల చెప్పిన ఒక విషాదకరమైన సంఘటన అందరిని షాక్ కి గురి చేసింది. అతని తమ్ముడి దుర్మరణం బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. నవ్వుతూ కళ్ళముందు పెరిగిన తమ్ముడు ఇప్పుడు లేకపోవడం ఎంతో ఆవేదనని కలిగిస్తోందని నాగిన్ 3 ఫెమ్ ప్రిన్స్ చెప్పడం భావోద్వేగానికి లోను చేస్తోంది. 

అసలు వివరాల్లోకి వెళితే.. ప్రిన్స్ తమ్ముడు రూపేష్ అమెరికాలో జాబ్ చేసుకుంటూ అక్కడే సెటిల్ అయ్యాడు. అయితే రీసెంట్ గా స్నేహితులతో కలిసి బీచ్ కి వెళ్లిన అతను మళ్ళీ తిరిగి రాలేదు. స్నేహితులు చెబుతున్నా వినకుండా టొరంటో బీచ్ లోపలికి వెళ్లిన రూపేష్ కొన్ని నిముషాల్లోనే విగాత జీవిలా మారిపోయాడు. అతనికి ఈత కూడా రాదని.. ఇటీవలే ఎంతో సంతోషంగా స్వదేశంలో పెళ్లి చేసుకున్నట్లు ప్రిన్స్ తెలిపారు. 

వీసా ఆలస్యం కారణంగా తమ్ముడి భార్య యువికా అమెరికాకు వెళ్లలేదని ప్రస్తుతం తన భార్య ఆమెను ఓదారుస్తోందని అన్నారు. అలాగే ప్రస్తుతం తమ్ముడి బాడీ అమెరికాలోనే ఉందని అమ్మా నాన్నలు స్వదేశానికి తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రిన్స్ వివరణ ఇచ్చాడు.