Dharmendra: దిగ్గజ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని కరణ్ జోహార్ ధృవీకరించారు.
బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
దిగ్గజ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర(89) ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని కరణ్ జోహార్ ధృవీకరించారు. దీంతో భారతీయ సినిమా పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ధర్మేంద్ర ఇటీవల అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఆయన కన్నుమూసినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఆయన కూతురు, కుమారులు ఖండించారు. ఆయన కోలుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇంతలోనే కన్నుమూయడం అత్యంత బాధాకరం.
అత్యధిక సినిమాలతో రికార్డు క్రియేట్ చేసిన ధర్మేంద్ర
ధర్మేంద్ర ఆరున్నదశాబ్దాలపాటు నటుడిగా రాణించారు. భారతీయ సినిమాకి విశేష సేవలందించారు. ఆయన తన కెరీర్‌లో 300లకుపైగా చిత్రాల్లో నటించారు. హిందీలో అత్యధిక సినిమాలు చేసిన హీరోగా రికార్డు సృష్టించారు. అంతేకాదు బాలీవుడ్‌లో అందగాడిగా పాపులర్ అయ్యారు. ఆయన అందానికి ఎంతో మంది అమ్మాయిలు ఫిదా అయ్యారంటే అతిశయోక్తి కాదు. అమ్మాయిలే కాదు, హీరోయిన్లు కూడా పడిపోయారు. ఆయనకు చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
ధర్మేంద్ర రెండు పెళ్లిళ్లు, ఫ్యామిలీ
ధర్మేంద్ర 1954లో ప్రకాష్ ఔర్‌ని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 1980లో స్టార్ హీరోయిన్ హేమా మాలినిని వివాహం చేసుకున్నారు. ధర్మేంద్రకి ఇద్దరు కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌తోపాటు కూతురు ఈషా డియోల్ ఉన్నారు. సన్నీ డియోల్ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాబీ డియోల్ ఇటీవల విలన్‌గా టర్న్ తీసుకుని బిజీగా ఉన్నారు. ఆయన `యానిమల్`తో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఆయన బాలయ్య నటించిన `డాకు మహారాజ్`లో నటించారు.
`డిల్ భి తేరా హమ్ తేరే` అనే చిత్రంతో నటుడిగా ఎంట్రీ
ధర్మేంద్ర డిసెంబర్ 8 1935లో జన్మించారు. పంజాబీ జాట్ ఫ్యామిలీలో ఆయన జన్మించారు. సినిమాల్లోకి రాకముందే ఆయనకు ప్రకాష్ కౌర్‌తో వివాహం జరిగింది. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో మంబయికి అడుగుపెట్టారు. 1960లో `డిల్ భి తేరా హమ్ తేరే` అనే చిత్రంతో నటుడిగా అడుగుపెట్టారు. `అయీ మిలాన్ కిబేలా`, `ఫూల్ ఔర్ పత్తర్` చిత్రాలతో విజయాలు అందుకున్నారు. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ``ఆయే దిన్ బహర్ కే` చిత్రంతో స్టార్ హీరోగా ఎదిగారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ధర్మేంద్ర రాజకీయాల్లోనూ చురుకుగా ఉన్నారు. ఆయన బీజేపీ నుంచి ఎంపిగా ఎంపికయ్యారు. ఆయన భారతీయ సినిమాకి అందించిన సేవలకుగానూ భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో 2012లో సత్కరించింది.


