వాయిదా పడిన సినిమాలు వెలవెల బోతున్న థియేటర్లు సినిమా షూటింగ్ లపైనా ప్రభావం

రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో టాలీవుడ్ షేకైపోతుంది. మోదీ సంచలన నిర్ణయం సినిమా ఇండస్ట్రీకే సినిమా చూపిస్తుంది.పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన గంటల వ్యవధిలోనే అమలు చేయటంతో సినీ రంగంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాల మీద ఈ ప్రభావం తీవ్రంగా కనిపించనుంది.

ఇప్పటికే 500, 1000 రూపాయల నోట్లు చిత్తుకాగితాలుగా మారిపోవటం వంద రూపాయల నోట్లకు తీవ్ర కొరత ఏర్పడటంతో శుక్రవారం ఎంత మంది ప్రేక్షకులు థియేటర్ల వరకు వస్తారు అన్నది ప్రశ్నగా మారింది. దీంతో ఈ వారం రిలీజ్ అవుతున్న ఇంట్లో దెయ్యం నాకేం భయం తాజాగా విడుదలను వాయిదా వేసుకుంది. రిలీజ్ డేట్ ను తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది.

నాగచైతన్య కొత్త సినిమా సాహసం శ్వాసగా సాగిపో చిత్రయూనిట్ విడుదల వాయిదాపై ఆలోచనలో పడ్డారు. మరి ఈ గండం నుంచి అల్లరి నరేష్ నాగచైతన్యలు ఎలా బయట పడతారో చూడాలి.

అదే సమయంలో సెట్స్ మీద ఉన్న సినిమాలపై కూడా ఈ ప్రభావం భారీగానే కనిపిస్తోంది. ముఖ్యంగా సినిమా షూటింగ్ సమయంలో ఎక్కువగా రోజువారి పేమెంట్సే ఉంటాయి. అందుకోసం ఎక్కువగా 500, 1000 నోట్లనే వినియోగిస్తుంటారు నిర్మాతలు, ఒక్కసారిగా ఆ నోట్ల వినియోగం ఆగిపోవటంతో షూటింగ్ దశలో ఉన్న సినిమాలు కూడా తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

మరోవైపు ఇప్పటికే థియేటర్లో ఆడుతున్న సినిమాల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఆన్ లైన్లో బుక్కింగ్ ఉన్న వాళ్లు తప్పితే థియేటర్లో టికెట్ కొనుక్కొని వెళ్లే వాళ్లు పెద్దగా కనిపించడం లేదు. సినిమా థియేటర్లతో కళకళలాడే ఆర్ టీసీ క్రాస్ రోడ్డు పరిసర ప్రాంతాలు ఇప్పుడు బోసిపోతున్నాయి.