బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసుకు సంబంధించి మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం రంగంలోకి దిగిన సీబీఐ కేసు విచారణ వేగవంతం చేశారు. కొత్త టెక్నిక్‌తో, కొత్త మెథడ్‌లో ఈ కేసు విచారణ చేపడుతున్నారు. మరోవైపు ఈ కేసులో బీజేపీ నేత సుబ్రమణియన్‌ స్వామి వరుసగా సంచలన ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. 

తాజాగా మరోసారి ఆయన షాకింగ్‌ ఆరోపణలు చేశారు. సుశాంత్‌పై విష ప్రయోగం జరిగిందన్నారు. ట్విట్టర్‌ ద్వారా సుబ్రమణియన్‌ స్వామి స్పందిస్తూ, సుశాంత్‌పై విష ప్రయోగం జరిగింది. ఆయన కడుపులో ఉన్న విషం పోయేంత వరకు వేచి చూసి శవ పరీక్ష నిర్వహించారు. ఉద్దేశ్యపూర్వకంగానే సుశాంత్‌ భౌతికకాయానికి పోస్ట్ మార్టం ఆలస్యం చేశారు. హంతకుల రాక్షస మనస్తత్వం,  వారి చెడు ఉద్దేశాల గురించి త్వరలోనే బయటడుతుంది` అని అన్నారు. 

ఇంకా ఆయన చెబుతూ, సుశాంత్‌ సన్నిహితుడు సందీప్‌ సింగ్‌పై కూడా సుబ్రమణియన్‌ స్వామి అనుమానం వ్యక్తం చేశారు. అతను దుబాయ్‌కి ఎందుకు వెళ్తున్నాడని, ఈ విషయాలపై విచారణ జరగాలన్నారు. సుశాంత్‌ మరణానికి కారకుల వివరాలు వెల్లడయ్యే సమయం ఆసన్నమైందన్నారు. 

ఇదిలా ఉంటే సుబ్రమణియన్‌ స్వామి.. సుశాంత్‌ మరణానికి శ్రీదేవి మరణానికి, సునంద పుష్కర్‌ మరణానికి సంబంధం ఉందని, దుబాయ్‌ చెందిన డ్రగ్‌ మాఫియా లీడర్‌ అయాష్‌ఖాన్‌కి సంబంధం ఉందని ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సంచలన ఆరోపణతో కేసుని మరింత రక్తి కట్టిస్తున్నారు.