సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ది ఆత్మహత్య కాదు, హత్యే అని బీజేపీ నాయకులు నారాయణ్‌ రాణె సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌ తనకు తాను చనిపోలేదని, ఎవరో హత్య చేశారని ఆరోపించారు. దీంతో సుశాంత్‌ డెత్‌ కేసు మరో మలుపు తీసుకుంటోంది. 
 
జూన్‌ 14న సుశాంత్‌ తన అపార్ట్ మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మొదట దీన్ని అంతా ఆత్మహత్యగానే భావించారు. మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నారని, ఛాన్స్ లేకపోవడం వల్ల మానసికంగా కృంగిపోయాడని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి ముంబయి పోలీసులు విచారణ చేపడుతున్నారు. 

సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ ఫిర్యాదు మేరకు బీహార్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సుశాంత్‌ కేసుకు సంబంధించి అనేక కొత్త కోణాలు బయటపడుతూ వస్తున్నాయి. మనీ లాండరింగ్‌ జరిగిందని, తన ప్రియురాలు రియా కోట్ల రూపాయలు అక్రమంగా తరలించిందన్నారు.  సుశాంత్‌ మరణం వెనకాల మాఫియా, బడా బాబులున్నట్టు వార్తలొచ్చాయి. ఓ డెర్మాటాలజిస్ట్ డాక్టర్‌ సుశాంత్‌ది ఆత్మహత్య కాదు, హత్య చేశారని సంచలనాలకు తెరలేపారు. అనంతరం ముంబయి కమిషనర్‌ మాట్లాడుతూ, నొప్పిలేకుండా చనిపోవడం ఎలా అని సుశాంత్‌ నెట్‌లో సెర్చ్ చేశారని, ఆయనది ఆత్మహత్యే అన్నారు. 

ఇక ఇప్పుడు బీజేపీ నేత నారాయణ్‌ రాణె మరో సంచలనానికి తెరలేపారు. ఈ కేసు నుంచి కొందరిని కాపాడేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణలో మహారాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో లేదని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. సుశాంత్ అనుమానాస్పద మృతి పట్ల నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు బీహార్ ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించింది. సుశాంత్ చనిపోయింది ముంబైలో కావడంతో బాంద్రా పోలీసులు, సుశాంత్ సొంత రాష్ట్రం బీహార్ కావడం.. పైగా సుశాంత్ తండ్రి పాట్నాలో ఫిర్యాదు చేయడంతో బీహార్ పోలీసులు కూడా ఈ కేసును విచారిస్తున్నారు. 

కాగా ఈ కేసుని సీబీఐకి బదిలీ చేయాలని ముంబయి హైకోర్ట్ లో పిటీషన్‌ వేయగా తాజాగా కోర్ట్ వాయిదా వేసింది. ముంబయిలో భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో కేసు విచారణ సాధ్యం కాలేదు. ఈ పిటీషన్‌ని బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం విచారించాల్సి ఉంది. నటుడి మరణానికి సంబంధించిన కేసును సిబిఐకి బదిలీ చేయాలనే పిల్‌ని సమిత్ ఠక్కర్ తన న్యాయవాది రాస్పాల్ సింగ్ రేణు ద్వారా దాఖలు చేశారు.