తెలుగు  రాష్ట్రాల్లో అధికారం కోసం ప్రయత్నాలు  చేస్తున్న బీజేపీ.. సినీ ప్రముఖుల మద్దతు కూడా తీసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి  పురందేశ్వరిని, తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కిషన్ రెడ్డిలను నియామకం జరిగిన నేపథ్యంలో.. ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 

తెలుగు రాష్ట్రాల్లో అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. సినీ ప్రముఖుల మద్దతు కూడా తీసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీకి పలువురు బాలీవుడ్ ప్రముఖలతో పాటు.. పలు రాష్ట్రాల్లో కొందరు సినీ తారల మద్దతు ఉంది. ఏపీ, తెలంగాణ విషయానికి వస్తే మాత్రం.. బీజేపీకి సినీ తారల నుంచి మద్దతు అంతగా లేదనే చెప్పాలి. గతంలో బీజేపీ నేతగా ఉన్న కృష్ణంరాజు.. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు ఆ స్థాయి సినీ ప్రముఖుల మద్దతు బీజేపీకి లేదు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా బీజేపీ అగ్రనేతలు తెలుగు సినీ ప్రముఖులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. 

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ను బీజేపీ రాజ్యసభకు పంపిన సంగతి తెలిసిందే. అలాగే తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంలో కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశం కావడం, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హీరో నితిన్‌తో సమావేశమయ్యారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. కృష్ణంరాజు మరణించిన కొద్ది రోజులకు ప్రభాస్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇదిలా ఉంటే.. భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి.. ప్రధాని నరేంద్ర మోదీతో వేదిక పంచుకున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత.. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రామ్‌చరణ్, చిరంజీవిలు ప్రత్యేకంగా కలిశారు.

ఈ పరిణామాలను చూస్తే.. సినీ ప్రముఖల మద్దతును బీజేపీ కోరుకుంటున్నట్టే కనిపిస్తోంది. సినీ తారల మద్దతు ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలపడటానికి ఎంతో కొంత మేలు జరుగుతుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని, తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కిషన్ రెడ్డిలను నియామకం జరిగిన నేపథ్యంలో.. ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 

కిషన్ రెడ్డి విషయానికి వస్తే.. ఆయనకు సౌమ్యుడిగా పేరుంది. పలువురు సినీ ప్రముఖులతో ఆయన మంచి పరిచయాలే ఉన్నాయి. మరోవైపు దగ్గుబాటి పురందేశ్వరి విషయానికి వస్తే.. సీనియర్ ఎన్టీఆర్ కూతురిగా ఆమె కుటుంబానికి సినీ పరిచయాలు ఎక్కువే. ఆమె సోదరుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఆమె తండ్రి స్థాపించిన టీడీపీలో ఉన్నారు. మరోవైపు మరో సోదరుడు హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్‌లు మాత్రం.. ప్రస్తుతం ఏ పార్టీ తరఫున యాక్టివ్‌గా లేరు. 

జూనియర్ ఎన్టీఆర్ గతంలో టీడీపీ కోసం పనిచేసిన.. ఇప్పుడు మాత్రం న్యూట్రల్‌ వైఖరితో ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబుతో కూడా జూనియర్ ఎన్టీఆర్‌కు సత్సంబంధాలు లేవనే ప్రచారం ఉంది. అయితే పురందేశ్వరి కుటుంబంతో మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌కు స్నేహపూర్వక బంధమే ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పురందేశ్వరి ద్వారా.. సీనియర్ ఎన్టీఆర్ మద్దతుదారులలో కొందరినైనా తమ వైపుకు తిప్పుకోవడంతో పాటు, జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా పార్టీ వైపు తీసుకొచ్చే ప్రణాళికలను బీజేపీ అధిష్టానం రచిస్తుందా? అనే చర్చ కూడా సాగుతుంది. జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయినప్పటి నుంచే.. ఆయనను తమ పార్టీ ప్రచారానికి వాడుకోవాలనే ఆలోచనతో బీజేపీ ఉందనే ప్రచారం సాగింది. ఇక, నందమూరి కుటుంబంలోని హీరోలతోనే కాకుండా.. టాలీవుడ్‌లోని ఇతర సినీ ప్రముఖలతో కూడా పురందేశ్వరికి స్నేహపూర్వక సంబంధాలే ఉన్నాయి.