బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బిపాసా బసు (Bipasa Basu) తాజాగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లిదండ్రులైన స్టార్ కపుల్ కరణ్ సింగ్ గ్రోవర్, బిపాసాకు అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బిపాసా బసు (Bipasa Basu), స్టార్ యాక్టర్ కరణ్ సింగ్ గ్రూవర్ (Karan Singh Grover) తాజాగా తల్లిదండ్రులయ్యారు. తాజాగా బేబీ గర్ల్ కు జన్మనిచ్చిన బిపాసా బసు ఎంతగానో మురిసిపోతోంది. తను తల్లైయ్యాక కాస్తా ఎమోషనల్ అవుతూ కామెంట్స్ చేసింది. ఈ స్టార్ కపుల్ ఆడబిడ్డకు జన్మనివ్వడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే బాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రెటీలు కూడా బిపాసాకు, భర్త కరణ్ సింగ్ గ్రూవర్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ట్వీటర్ వేదికన శుభాకాంక్షల వెల్లువతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
2015లోనే బిపాసా, కరణ్ కు పరిచయం ఏర్పడింది. భూషణ్ పటేల్ తెరకెక్కించిన ‘ఎలోన్’ చిత్రంలో మొదటిసారిగా కలిసి నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే లవ్ ట్రాక్ జోరుగా నడిచింది. ఆ తర్వాతి సంవత్సరంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక మొన్నటి వరకు మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేసిన బిపాసా.. ఈ ఏడాది ఆగస్టులోనే ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. అప్పటి నుంచి తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ వచ్చింది.
ఇక ఈ రోజు ఆడబిడ్డకు జన్మనివ్వడంతో సంతోషంలో మునిగి తేలిపోతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తన కూతురు చిట్టి పాదాలను చూపించే ఫొటోను షేర్ చేసుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.... ‘మా ఇద్దరి ప్రేమకు, పెద్దల ఆశీర్వాదానికి దివ్వమైన ఆడశిశువుని పొందాం’ అంటూ పేర్కొంది. ఇక తన కూతురుకి ‘దేవీ బసు సింగ్ గ్రోవర్’ అనే పేరును నామకరణం చేశారు. ఏదేమైనా తల్లైయ్యాక బిపాసా తన కూతురిపై చూపిస్తున్న ప్రేమకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఖుషీ అవుతున్నారు.
