Asianet News TeluguAsianet News Telugu

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం బయో బబుల్‌..దాటితే వేటు !

షూటింగ్ మొత్తం బయో బబుల్‌ వాతావరణంలో జరుగుతుంది. బయోబబుల్ అంటే బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని సురక్షితంగా ఉండటం. కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో బయిటవారిని ఒక్కరని కూడా సెట్ కు అనుమతించకుండానే షూటింగ్ నిర్వహించనున్నారు.

Bio Bubble Created for Rajamouli RRR
Author
Hyderabad, First Published Oct 5, 2020, 5:50 PM IST

 దర్శక ధీరుడు యస్‌.యస్‌ రాజమౌళి,ఆయన ఫ్యామిలీ సభ్యులు అంతా కరోనాను జయించారు. తిరిగి యధావిధిగా పనుల్లో పడిన సంగతి తెలిసిందే. తమ తాజా ప్రాజెక్టు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ విషయమై ఆయన ఈ సారి సీరియస్ గా ఉన్నారు. ఎట్టి పరిస్దితుల్లోనూ త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఫినిష్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుతున్న సమాచారం మేరకు  త్వరలో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు రాజమౌళి అనువైన, ఏ విధమైన ఇబ్బందులు రానటువంటి ప్లానింగ్ చేసినట్లు  సమచారం. ఈ మేరకు వర్క్ ప్రారంభం అయ్యింది. షూటింగ్ సజావుగా జరగటం కోసం బయో బబుల్ ని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. 

షూటింగ్ మొత్తం బయో బబుల్‌ వాతావరణంలో జరుగుతుంది. బయోబబుల్ అంటే బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని సురక్షితంగా ఉండటం. కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో బయిటవారిని ఒక్కరని కూడా సెట్ కు అనుమతించకుండానే షూటింగ్ నిర్వహించనున్నారు. 

అదే సమయంలో  నటీనటులు, టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ లు, మిగతా స్టాఫ్‌ మెంబర్స్‌, నిర్మాతతో సహా అంతా కూడా క్వారంటైన్‌ రూల్స్‌కు కట్టుబడి ఉండాలనేది రాజమౌళి నిబంధన.  ఎవరైనా హద్దులు దాటితే వారికి షూటింగ్ నుంచి ఉద్వాసన తప్పదనే వార్నింగ్‌ ఇస్తారట. బయో బబుల్‌ నుంచి ఎవరైనా బయటకు వెళ్తే వాళ్లు ఆరు రోజులు క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది.  సహాయ సిబ్బందితో మాట్లాడేందుకు కూడా బయటి వ్యక్తులను అనుమతించరు.  కేవలం నటీనటులకే కాదు..వారితో పాటు వచ్చే ఫ్యామిలీ మెంబర్స్‌కు ఇదే రూల్ వర్తిస్తుందని తెలిసింది.‌ ప్రతీ ఐదు రోజులకొకసారి అంతా కోవిడ్‌-19 టెస్టులు చేయించుకోవాలని డిసైడ్ అయ్యినట్లు తెలుస్తోంది. మీడియా కూడా అక్కడ ప్రవేశించలేదు. టీమ్ అందరి టెంపరేచర్‌ను రెగ్యులర్‌గా పరీక్షిస్తారు. 

 ఇక ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొమరం భీమ్, రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా మొత్తంలో పలు గెటప్స్‌లో కనిపిస్తారట ఈ ఇద్దరు హీరోలు. బ్రిటిష్‌ అధికారులను ఎదుర్కొనే ప్రయత్నంలో రకరకాల గెటప్స్‌ వేసి వాళ్లను తెలివిగా ఢీ కొంటారని చెప్తున్నారు. పోలీస్‌ ఆఫీసర్‌గా చరణ్, బందిపోటు గెటప్‌లో ఎన్టీఆర్‌ కనిపిస్తారట.

మరికొన్ని గెటప్స్‌లోనూ ఎన్టీఆర్, చరణ్‌లు కనిపిస్తారని తెలిసింది. ఈ స్పెషల్‌ గెటప్స్‌ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటాయట. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్, చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నటించనున్నారు.ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు.

Follow Us:
Download App:
  • android
  • ios