ఈ సీజన్ మొత్తంలో ఎన్నడూ లేని విధంగా గత రెండు రోజులుగా బిగ్ బాస్ షో సాగుతుంది. పెళ్లి టాస్క్ తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాడు  బిగ్ బాస్. ఈ షో కోసం స్పాన్సర్ చేస్తోన్న ఓ షాపింగ్ మాల్ ని ప్రమోట్ చేయడానికి ఈ టాస్క్ ని ఇచ్చినట్లు అనిపిస్తోంది. 'రాధాకృష్ణ మధులత' అనే రెండు బొమ్మలకు పెళ్లి చేయడం, మెహందీ ఫంక్షన్, పెళ్లి, సంగీత్ ఆఖరికి శోభనం కూడా ఈ టాస్క్ లో భాగమే.

ఈ పెళ్లి నాటకం గత రెండు రోజులుగా సాగుతుంది. కనీసం నిన్నటితో ఎండ్ చేస్తారనుకుంటే ఈరోజు కూడా ఆ టాస్క్ సాగనుంది. బిగ్ బాస్ సీజన్ మొత్తానికి ఇదొక చెత్త ఎపిసోడ్ అనే చెప్పాలి. పైగా ఈ పెళ్లి కోసం కంటెస్టెంట్ లను నటించమంటే వారి అతి నటన ప్రేక్షకులను మరింత విసిగిస్తుంది. అనసూయ లాంటి హాట్ యాంకర్ ఈ టాస్క్ లో పాలు పంచుకున్న పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. పైగా ఈ టాస్క్ లో సామ్రాట్, రోల్ రైడాలను పిలిచి సీక్రెట్ టాస్క్ ఇవ్వడం కామెడీగా అనిపిస్తుంది. పోనీ ఆ టాస్క్ ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉందా..? అంటే అదీ లేదు.

దీంతో రెగ్యులర్ గా ఈ షో ఫాలో అయ్యేవారిని కాస్త ఈ టాస్క్ భయపెట్టిందనే చెప్పాలి. వామ్మో.. ఇంక మా వల్ల కాదు అంటూ తలలు పట్టుకుంటున్నారు. కనీసం ఈరోజైనా టాస్క్ పూర్తయిందని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే మంచిది లేదంటే టీఆర్పీ రేటింగులు అమాంతం పడిపోయినా.. ఆశ్చర్యపోనక్కర్లేదు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నామినేషన్స్ లో ఉన్నారని జనాలకు ఆసక్తి కలిగిన ఈ వారాన్ని కాస్త బిగ్ బాస్ పెళ్లి అంటూ విరక్తి వచ్చేలా చేసేశాడు. ఇకనైనా బ్రాండింగ్ ని పక్కన పెట్టి షో లో టాస్క్ లపై కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది!