బిగ్ బాస్ ఐదో సీజన్‌లో విన్నర్‌గా నిలిచాడు వీజే సన్నీ. ఆయన హీరోగా బిజీ అవుతున్నారు. ఇప్పటికే మూడు సినిమాల్లో హీరోగా నటించిన ఆయన ఇప్పుడు మరో సినిమాని స్టార్ట్ చేశారు.
బిగ్ బాస్ ఐదవ సీజన్‌లో పాపులర్ అయ్యారు వీజే సన్నీ. తనదైన డేరింగ్ గేమ్‌తో సీజన్ విన్నర్‌గా నిలిచారు. లక్షల మంది హృదయాలను గెలుచుకున్నారు. అంతేకాదు ఎవరికి సాధ్యం కాని విధంగా హీరోగా వరుసగా అవకాశాలను అందుకుంటున్నారు. బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో పాపులర్ అయిన సోహైల్ తర్వాత ఆ స్థాయిలో హీరోగా అవకాశాలను వీజే సన్ని సొంతం చేసుకోవడం విశేషం. ఇప్పటికే సన్నీ `సకలగుణాభిరామ` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. అది పెద్దగా మెప్పించలేదు.
ఆ తర్వాత ఇటీవల `ఏటీఎం` అనే వెబ్‌సిరీస్‌తో మెప్పించాడు. ఇందులో తనదైన నటనతో అదరగొట్టారు. బిగ్ బాస్ షో తర్వాత ఒప్పుకుని చేసిన ప్రాజెక్ట్ ఇది. రిలీజ్ అయిఏ హిట్ అయ్యింది. విశేష ఆదరణ పొందింది. ప్రస్తుతం హీరోగా సప్తగిరితో కలిసి `అన్‌స్టాపబుల్` చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా హీరోగా మరో సినిమాని ప్రారంభించారు సన్నీ. ఆయన హీరోగా రైటర్ సంజయ్ దర్శకుడిగా మారి ఈ నయా మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇది గురువారం ప్రారంభమైంది.
వినోద ప్రధానమైన చిత్రాలు అందించాలన్న సంకల్పంతో , అభిరుచితో టెక్సాస్ కు చెందిన ఫుల్ మూన్ ప్రొడక్షన్స్ అనే నూతన సంస్థ సన్నీ హీరోగా సినిమాని ప్రారంభించింది. శివన్నారాయణ, శైలజ ప్రియ, సప్తగిరి, రేఖ ఇందులో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వైవిధ్యమైన కథలను చిత్రీకరించడంలో పేరు పొందిన వి. జయశంకర్ దర్శకత్వ పర్యవేక్షణలో ఒక అద్భుతమైన వినోదాత్మక చిత్రంగా ఇది రూపొందనుంది.
ఈ సందర్భంగా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ సంస్థ అధినేతలు మాట్లాడుతూ, `వి.జె. సన్నీ హీరోగా ప్రారంభించిన సినిమా షూటింగ్ షెడ్యూల్ కంటిన్యూగా ఉంటుంది. సింగిల్ షెడ్యూల్ లో సినిమాను కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేశాం . ఎంతో ప్రతిభావంతులైన నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు మా చిత్రానికి పని చేస్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులు, దర్శకులు, నిర్మాతలను కనెక్ట్ చేసే టాలెంట్-స్కౌటింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన Hunt4Mint తో చేతులు కలపడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులను పరిశ్రమకు పరిచయం చేయడంతో పాటు వారి ద్వారా మరిన్ని మంచి చిత్రాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతో అభిరుచితో ప్రారంభించిన మా సంస్థ నుండి మంచి చిత్రాలు చేయనున్నాం. త్వరలో మా చిత్రానికి సంబంధించిన టైటిల్ తో పాటు ఇతర వివరాలు వెల్లడిస్తాం` అని అన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ః కార్తీక్ శ్రీనివాస్; సంగీతంః మదీన్; ఆర్ట్ డైరెక్టర్ః రాజీవ్ నాయర్; చీఫ్ కో-డైరెక్టర్ః చిన్న; కో -డైరెక్టర్ః సంతోష్ కృష్ణ; అసోసియేట్ డైరెక్టర్ః యశ్వంత్; అసిస్టెంట్ డైరెక్టర్ః యష్ ; పిఆర్ ఓః లక్ష్మీగణపతి- వంగాల కుమారస్వామి; నిర్మాణంః ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ ; దర్శకత్వ పర్యవేక్షణః వి.జయశంకర్; రచన-దర్శకత్వంః సంజయ్.
