కరోనా  సమస్యతో 'బిగ్ బాస్ -4'  అసలు ఉంటుందో ఉండదో అని అందరూ అనుకున్నారు. అయితే అన్ని జాగ్రత్తలతో  ఎట్టకేలకు షో ప్రారంభం అయ్యింది. గత మూడు సీజన్ల కంటే ఎక్కువ టీఆర్పీ సాధించాలనుకున్న ఈ షో పై  జనాలకు పెద్దగా ఆసక్తి లేకపోయింది.  అందుకు కారణం అందులోకి వెళ్లిన కంటెస్టెంట్లలో ఎక్కువ మంది ప్రజలకు అంతగా తెలియకపోవటమే. 

దాంతో మొదటివారం కొంచెం నీరసంగా సాగినా గంగవ్వ , మిగిత కంటెస్టెంట్ల పైన బిగ్ బాస్ పైన వేస్తున్న పంచ్ లకు అందరూ ఫిదా అయ్యారు. అయితే ఈ షో మొదటి ఎపిసోడ్ లో ఎవరు వస్తున్నారు అని అభిమానులు ఎంతో ఆతృతతో చూసారు. దాంతో ఆ ఎపిసోడ్ కి గత మూడు సీజన్లకు మించి అత్యధిక టీఆర్పీ వచ్చినట్లు హోస్ట్ నాగార్జున తన ట్విట్టర్ వేదికగా తెలిపాడు.  

కానీ  టీఆర్పీ రేటింగ్ లో చానెల్ నిర్వాహకులకు, షో యాజమాన్యానికి అసంతృప్తినే మిగిల్చింది. తొలి రోజునే సరైన పోటీదారులు లేరని, ఈ షో నిలవడం కష్టమేనని వార్తలు  వచ్చిన సంగతి తెలిసిందే. ఓపెనింగ్ ఎపిసోడ్ కు అత్యధికంగా 18.5 టీఆర్పీ రేటింగ్ వచ్చినప్పటికీ, సగటున  'కార్తీకదీపం', 'గృహలక్ష్మి' సీరియల్స్ ను మాత్రం బీట్ చేయలేకపోయింది. బిగ్ బాస్ ప్రారంభమైన తొలివారంలో 'కార్తీకదీపం' ఆరో స్థానంలో నిలువగా, ఆపై 'గృహలక్ష్మి', దాని తరువాత బిగ్ బాస్ నిలవడం గమనార్హం.

కాగా, నాన్ ఫిక్షన్ షో కేటగిరీలో బార్క్ యూనివర్స్ లో ఇప్పటివరకూ ఏ ఎపిసోడ్ కూ రానంత రేటింగ్ బిగ్ బాస్ సీజన్ 4 తొలి ఎపిసోడ్ కు వచ్చిందని కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న స్టార్ మా అధికారికంగా వెల్లడించింది. అన్ని బిగ్ బాస్ షోలతో పోలిస్తే, లేటెస్ట్ షోకు అత్యధిక టీఆర్పీ 18.5 వచ్చిందని కూడా తెలియజేసింది. అయితే, ఆపై ఎపిసోడ్స్ ను మాత్రం జనం అంత ఆసక్తిగా చూడటం లేదని సమాచారం.