తమిళ బిగ్ బాస్ సీజన్ 3 రసవత్తరంగా సాగుతోంది. తాజాగా హౌస్ లోకి కుటుంబ సభ్యులను అనుమతించారు. దీంతో తమవారిని చూసిన హౌస్ మేట్స్ ఎమోషనల్ అయ్యారు. కొంతమంది ఆనందంతో ఏడ్చేశారు. అయితే నటి, యాంకర్ లోస్లియాకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది.

చాలా కాలం తరువాత కూతురిని చూసిన లోస్లియా తండ్రి ఎమోషనల్ అవ్వలేదు సరికదా.. తన కూతురిపై కోప్పడ్డాడు. దానికి కారణం బిగ్ బాస్ హౌస్ లో లోస్లియా తన తోటి కంటెస్టంట్ కెవిన్ తో క్లోజ్ గా ఉంటోంది. వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో లోస్లియా తండ్రి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేను నిన్ను ఇలానే పెంచానా..? అంటూ కూతురితో గొడవ పడ్డాడు. తన తండ్రి కోప్పడుతూ తిట్టడంతో లోస్లియా కన్నీళ్లు పెట్టుకుంది.మరో కంటెస్టంట్ చేరన్.. లోస్లియా తండ్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తరువాత లోస్లియా తండ్రిని హత్తుకొని ఏడ్చింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో లోస్లియా తండ్రి వ్యవహరించిన తీరుపై సోషల్‌ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. 

టీవీ చానెల్‌లో కూతురిని దూషించడం పద్ధతి కాదంటూ నెటిజన్లు లోస్లియా తండ్రిపై మండిపడుతున్నారు. ప్రేక్షకుల హృదయాలను గెలుస్తూ ఇన్నాళ్లు బిగ్‌బాస్‌ పోటీలో ఉండగలిగినందుకు లోస్లియాను చూసి ఆమె తండ్రి గర్వపడాలి కానీ, ఇలా తిట్టడం ఏంటంటూ నిలదీస్తున్నారు. లోస్లియా-కెవిన్ ల మధ్య లవ్ ఎఫైర్ సాగుతున్నట్లు హైలైట్ చేస్తోన్న హోస్ట్ కమల్ హాసన్, బిగ్ బాస్ లపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.