బిగ్‌ బాస్‌ తెలుగు 7 ఫైనల్‌ ఈవెంట్‌ రోజు విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్ సృష్టించిన రచ్చ పెద్దది అవుతుంది. తమ ఫ్యామిలీపై దాడిపై తాజాగా అమర్‌ దీప్‌ స్పందించారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌ పూర్తయ్యింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ విన్నర్‌ అయ్యాడు. అతను ఓ కామన్‌ మ్యాన్‌ గా వచ్చి బిగ్‌ బాస్‌ విన్నర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడని చెప్పొచ్చు. దీంతో ఈ సారి బిగ్‌ బాస్‌ తెలుగు షో చాలా ప్రత్యేకంగా నిలిచింది. అయితే ఆదివారం సాయంత్రం అన్నపూర్ణ స్టూడియో వద్ద చోటు చేసుకున్న పరిణామాలు అందరిని ఆశ్చర్య పరిచాయి. షాక్‌కి గురి చేశాయి. ఫినాలే సెర్మనీ పూర్తయ్యాక విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్ అభిమానం ముసుగులో చేసిన వీరంగంతో అక్కడ చాలా మంది కంటెస్టెంట్లు ఇబ్బంది పడ్డారు. 

ముఖ్యంగా వారి కారు అద్దాలను ధ్వంసం చేశారు. దాడులకు తెగబడ్డారు. అమర్‌ దీప్‌ కారు అద్దాలు డ్యామేజ్‌ చేశారు. అలాగే అశ్వినీ, గీతూ రాయల్‌ కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. నానా వీరంగం చేశారు. అంతేకాదు ఆర్టీసీ బస్‌ అద్దాలను పగలగొట్టారు. ఈ నేపథ్యంలో సర్వత్రా ప్రశాంత్‌ ఫ్యాన్స్ పై విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణంగా ప్రశాంత్‌ సైతం ఇబ్బందులో పడాల్సి వచ్చింది. అయితే అమర్‌ దీప్‌ కారు అద్దాలు ధ్వంసం చేయడం కారణంగా ఆ గ్లాస్‌ పీసెస్‌ వాళ్ల అమ్మపై పడ్డాయి. 

అమర్‌ దీప్‌ని, వారి ఫ్యామిలీపై దురుసుగా ప్రవర్తించడం, బూతులు తిట్టడం చేశారట. ఈ నేపథ్యంలో అమర్‌ దీప్‌ అమ్మ ఓ వీడియో విడుదల చేసి మండిపడింది. హెచ్చరించింది. తాజాగా దీనిపై అమర్‌ దీప్‌ స్పందించారు. జరిగిన పరిణామాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు లభించిన సపోర్ట్ పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కానీ తాను ఇంటికి వచ్చే సరికి ఫ్యామిలీని రోడ్డుపై నిల్చోపెట్టడం చాలా బాధగా ఉందని వెల్లడించారు అమర్‌ దీప్‌. తన ఫ్యామిలీని అలా చేయడం, బూతులు తిట్టడం, కార్లని ధ్వంసం చేయడం పట్ల అమర్‌ దీప్‌ ఆవేదన చెందాడు. తనని ఏమైనా అనండి, తనని తిట్టండి, తనకు వ్యతిరేకంగా వీడియోలు పెట్టండి, నష్టం లేదు, తాను పట్టించుకోనని చెప్పారు. 

`ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి, నన్ను అనండి` అన్నాడు అమర్‌ దీప్‌. కానీ అమ్మ విషయంలో అలా చేయడం, ఫ్యామిలీ గురించి అలా మాట్లాడటం సరికాదని హెచ్చరించాడు. ఆ సమయంలో ఏదైనా జరగరానిది జరిగితే, ఫ్యామిలీకి హాని కలిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు అమర్‌. అదే జరిగే, తాను ఎలా రియాక్ట్ అవుతానో, తన లైఫ్‌ ఏం అవుతుందో చెప్పలేనని హెచ్చరించాడు అమర్‌. మన ఇంట్లో ఆడవాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉంటే బాగుంటుందన్నారు. జరగరానిది ఏదైనా జరిగితే, డబ్బు పోతే, కప్‌పోతే తిరిగి తెచ్చుకోవచ్చు. కానీ మనిషిపోతే తిరిగి రానని, దయజేసి ఎప్పుడూ, ఎవరి వద్ద ఇలా చేయకండి అని ఆయన వేడుకున్నారు. తన ఆవేదన వ్యక్తం చేశాడు.