బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ లో ఫిజికల్ ఎటాక్ జరిగిన సంగతి తెలిసిందే. గాజు పెట్టెలో ఉన్న డబ్బులును కొట్టేయడానికి శ్రీముఖి డంబెల్‌తో అద్దాలను పగలగొట్టగా.. రవికృష్ణ చేతితోనే అద్దం పగలగొట్టి డబ్బు తీసే ప్రయత్నం చేయగా అతడి చేతికి గాయమైంది. దీనికి కారణం శ్రీముఖి అంటూ హౌస్ మేట్స్ ఆమెని తప్పుబట్టారు. ఇక గురువారం నాటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యుల చర్యను సీరియస్ గా తీసుకున్న బిగ్ బాస్ వాళ్లకు క్లాస్ పీకారు.

కన్ఫెషన్ రూమ్ కి వెళ్లిన రవికృష్ణ ఈ విషయంలో తన తప్పు ఉందని బిగ్ బాస్ కి క్షమాపణలు చెప్పారు. అయితే రవిని అద్దం పగలగొట్టమని ప్రోత్సహించిన శ్రీముఖిపై బిగ్ బాస్ సీరియస్ అయ్యారు. దీనికి శిక్షగా ఆమెని వచ్చే వారం ఎలిమినేషన్ ని నేరుగా నామినేట్ చేశారు. ఆ తరువాత అలీ, పునర్నవిలకి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. సీక్రెట్ టాస్క్ లో సక్సెస్ అయితే తరువాతి వారం నామినేషన్ నుండి సేఫ్ అవుతారని బిగ్ బాస్ చెప్పారు.

సీక్రెట్ టాస్క్ లో భాగంగా రాత్రి అందరూ పడుకున్నాక 1.30 గంటల సమయంలో ఎవరి కంట పడకుండా అలీ సీక్రెట్ రూంలోకి వెళ్లాడు. ఆ తరవాత ఉదయం 7.30కి ఎవరి కంట పడకుండా పునర్నవి సీక్రెట్ రూంలోకి వెళ్లింది. అలీ, పునర్నవి సీక్రెట్ రూమ్ నుండి బయటకి రావాలంటే హౌస్ మేట్స్ రెండు త్యాగాలను చేయాలని సూచించారు బిగ్ బాస్. దీంతో వారంతా చెప్పులు, పెరుగు అని చెప్పారు.

ఆ తరువాత అలీ, పునర్నవి మళ్లీ ఇంట్లోకి రావాలని ఎంత మంది కోరుకుంటున్నారని బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని అడిగారు. హిమజ, బాబా భాస్కర్ తప్ప మిగిలిన సభ్యులంతా అలీ, పునర్నవి మళ్లీ రావాలని కోరుకున్నారు. అయితే, ఎవరైతే వాళ్లిద్దరూ రావాలని కోరుకున్నారో వాళ్లు రెండు త్యాగాలు చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పారు. ఇంట్లో చెప్పులు వేసుకోకూడదని, భోజనంలో పెరుగు ఉండదని తెలిపారు.