బిగ్ బాస్ 3 షో ప్రారంభం కాకముందే వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ప్రముఖ యాంకర్ శ్వేతా రెడ్డికి బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. కానీ ఆమెని సంప్రదించిన కొందరు బిగ్ బాస్ కో ఆర్టినేటర్లు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం శ్వేతా రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేసింది. దీనితో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఏప్రిల్ నెలలో బిగ్ బాస్ షోకు ఆడిషన్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కొందరు కో ఆర్టినేటర్లు శ్వేతా రెడ్డిని సంప్రదించారు. అన్ని డాక్యుమెంట్లపై సంతకం చేశాక.. బాస్ ని ఎలా సంతృప్తి పరుస్తారు అంటూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. బిగ్ బాస్ లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉన్నట్లు శ్వేతా రెడ్డి ఘటన ద్వారా చర్చనీయాంశం అయింది. 

బంజారాహిల్స్ పోలీసులు శ్వేతా రెడ్డి వివాదం గురించి మాట్లాడుతూ.. శ్వేతా రెడ్డి ఫిర్యాదు మేరకు ఆమె కో ఆర్టినేటర్స్ తో సమావేశం అయిన సిసి టివి ఫుటేజ్ పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమ విచారణ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన వారిపైనే ఉంటుందని.. మరిన్ని ఆధారాలు లభిస్తే బిగ్ బాస్ నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకుంటాం అని పోలీసులు తెలిపారు.