`ఆర్‌ఆర్‌ఆర్`ని ఓ వైపు మహమ్మారి వెంటాడుతుండగా వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. కొత్తగా మరో అడ్డంకి ఎదురైంది. సినిమా విడుదల నిలిపివేయాలంటూ తెలంగాణ హైకోర్ట్ లో ఓ పిల్ దాఖలైంది.
`ఆర్‌ఆర్‌ఆర్` సినిమాకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు విడుదలకు అడ్డంకులు ఎదురవుతుండటంతో యూనిట్ అయోమయంలో పడిపోగా, ఇప్పుడు కొత్తగా సినిమా విడుదల నిలిపివేయాలంటూ కోర్ట్ లో ఓ పిల్ దాఖలైంది. `ఆర్‌ఆర్‌ఆర్` సినిమా విడుదలై స్టే విధించాలని అభ్యర్థిస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య పిల్ హైకోర్ట్ లో ప్రజా ప్రయోజన వ్యాఖ్యం(పిల్) దాఖలు చేశారు. అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్ చరిత్రలను `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రంలో వక్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు దాఖలు చేశారు. సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వొద్దని కోరారు.
అయితే ఈ పిటిషన్‌ని విచారణకు తీసుకుంది కోర్ట్. జస్టిస్ ఉజ్జల్ భూయన్, జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి ధర్మాసనం విచారణకు తీసుకుంది. ప్రజాప్రయోజన వ్యాఖ్యం కావడం వల్ల విచారణకు తీసుకొవచ్చని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ వెల్లడించింది. దీంతో `ఆర్‌ఆర్‌ఆర్` విడుదలై నీలినీడలు నెలకొన్నాయి. ఇప్పటికే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జనవరి 7న విడుదల కావాల్సిన `ఆర్‌ఆర్‌ఆర్` సినిమా వాయిదా పడింది. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత విడుదల చేస్తామని చిత్ర బృందం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సినిమా మొత్తానికే విడుదల నిలిపివేయాలని హైకోర్ట్ లో పిల్ దాఖలు కావడం `ఆర్‌ఆర్‌ఆర్` యూనిట్‌కి పెద్ద షాక్ అని చెప్పొచ్చు.
మరి దీనిపై రాజమౌళి టీమ్ ఎలాంటి వివరణ ఇస్తుందో, కోర్ట్ ఏం చెప్పబోతుందో అనేది ఆసక్తిగా మారింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందిన `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రానికి రాజమౌళి దర్శకుడు. ఆయన తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ దీనికి కథ అందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాని నిర్మించారు. ఇందులో అలియాభట్, అజయ్ దేవగన్, శ్రియా, సముద్రఖనీ, ఒలివియా మోర్రీస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్‌లో భారీగా విడుదలకు ప్లాన్ చేశారు. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే ఇటీవల కరోనా మరింతగా విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమాని విడుదల చేయడం కరెక్ట్ కాదని భావించిన రాజమౌళి బృందం ఎట్టకేలకు సినిమాని వాయిదా వేశారు.
