ఇది ఇప్పుడు రిలీజ్‌ కాబోతున్న ప్రభాస్‌ పాన్‌ ఇండియా చిత్రం `రాధేశ్యామ్‌`, అలాగే `ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఎంతగానో హెల్ప్ కాబోతుంది. ఇమ్మిడియెట్‌గా `రాధేశ్యామ్‌` సినిమాకి ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. 

ఏపీలో టికెట్ రేట్లు తగ్గించడంతో టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. భారీ బడ్జెట్‌ చిత్రాలకు భారీగా నష్టాలు తీసుకొచ్చింది. `అఖండ`, `పుష్ప`, `భీమ్లా నాయక్‌`, `శ్యామ్‌ సింగరాయ్‌`, `డీజే టిల్లు` వంటి చిత్రాలపై ఈ ప్రభావం బాగా పడింది. పెద్ద బడ్జెట్‌ సినిమాల కలెక్షన్లలో ఇది దాదాపు ముప్పై కోట్ల మేరకు నష్టం కలిగించిందని సినీ నిర్మాతల నుంచి వినిపిస్తున్న వాదన. 

ఇదిలా ఉంటే సినీ పెద్దలు సీఎం జగన్‌తో జరిపిన చర్చల ఫలితంగా టికెట్‌ రేట్లని పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం టికెట్‌ రేట్లని పెంచుతూ కొత్త జీవోని విడుదల చేసింది. ఇందులో మూడు ఏరియాలుగా థియేటర్లని విభజించి, థియేటర్లని నాలుగు రకాలుగా విభజించి, అందులోనూ నాన్‌ ప్రీమియం, ప్రీమియంగా డివైడ్‌ చేసి టికెట్‌ రేట్లని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. పెద్ద బడ్జెట్‌ సినిమాలకు టికెట్‌ రేట్లు పెంచుకునే వెసులుబాటుని, అలాగే చిన్న సినిమాలకు కచ్చితంగా ఓ షో వేసుకునే వెసులుబాటుని కల్పించింది.

పెంచిన టికెట్ల రేట్లు టాలీవుడ్‌కి పెద్ద ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే మంచి శుభవార్త. ఇది ఇప్పుడు రిలీజ్‌ కాబోతున్న ప్రభాస్‌ పాన్‌ ఇండియా చిత్రానికి ఎంతగానో హెల్ప్ కాబోతుంది. ఇమ్మిడియెట్‌గా `రాధేశ్యామ్‌` సినిమాకి ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. దీంతో చిత్ర బృందం సంతోషంలో మునిగిపోయారు. ఈ చిత్రం ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో తెలుగు రాష్టాల్లో అతిపెద్ద మార్కెట్‌ అయిన ఏపీలో ఈ సినిమా కలెక్షన్లకి చాలా హెల్ప్ అవుతాయి. అంతేకాదు టికెట్‌ రేట్లు పెంచుకునే వెసులుబాటు కూడా ఇవ్వడం ఇంకా పెద్ద బోనస్‌గా చెప్పాలి. 

దీంతోపాటు రాజమౌళి సినిమా `ఆర్‌ఆర్‌ఆర్‌`కి కూడా ఇది గుడ్‌న్యూస్‌. ఈ సినిమా మార్చి 25న విడుదల కానుంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రమిది. ఇది కూడా పాన్‌ ఇండియా చిత్రమే కావడం విశేషం. నిజానికి `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌` చిత్రాలు సంక్రాంతి సమయంలోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఒకవేళ ఆ సమయంలోనే విడుదలైతే భారీగా నష్టపోయేవి. ఆ రెండు చిత్రాలు దాదాపు యాభై కోట్ల వరకు నష్టాలు చవిచూసేవి. ఇప్పుడు వాటికి బిగ్‌ హెల్ప్ కాబోతున్నాయని, ఓ రకంగా వాయిదా పడి మంచే జరిగిందని చెప్పాలి. 

అయితే ఇది పవన్‌ కళ్యాణ్‌కిది బ్యాడ్‌ న్యూసే. పవన్‌ నటించిన `భీమ్లా నాయక్‌` ఫిబ్రవరి 25న తక్కువ టికెట్‌ రేట్లకే విడుదలైంది. రేట్లు పెంచే అవకాశం ఇవ్వలేదు, బెనిఫిట్‌ షోలు కూడా వేసుకునే అవకాశం ఇవ్వలేదు. చాలా కఠినంగా వ్యవహరించింది. పవన్‌తో ఏపీ ప్రభుత్వానికి నెలకొన్న రాజకీయంగా వ్యతిరేకత కారణంగా ఆయన సినిమాపై అది చూపించేందుకే టికెట్ల రేట్లకి సంబంధించిన కొత్త జీవోని ఆలస్యం చేశారనే ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. పవన్‌ని తొక్కేందుకే ఇలా చేశారనే కామెంట్లు వినిపించాయి. అయితే మంత్రి గౌతమ్‌రెడ్డి చనిపోవడం వల్లే జీవో ఆలస్యమైందని ఏపీ ప్రభుత్వం, మంత్రి పేర్నినాని తెలిపారు. ఏదేమైనా పవన్‌కి జరగాల్సిన నష్టం జరిగింది. ఆ సినిమాకి పాజిటివ్‌ టాక్ వచ్చినా, కలెక్షన్లు లేకపోవడంతో తీవ్ర నిరాశ చెందింది యూనిట్‌. ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజింగ్‌కి చేరుకుంది. ఓ మూడు రోజులు మాత్రమే ఆ చిత్రానికి కొత్త రేట్లు హెల్ప్ కాబోతున్నాయి. కానీ ఇప్పటికే జనాలు సినిమాని చూసేశారు. దీంతో ఏమాత్రం ప్రయోజనం చేకూరదని చెప్పాలి. 

అయితే పవన్‌ని దెబ్బ తీసేందుకే జీవోని ఆలస్యం చేశారని, ప్రభాస్‌ నటించిన `రాధేశ్యామ్‌`, రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రాలకు సహకరించాలనే ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు జీవోని తీసుకొచ్చిందని నెటిజన్ల నుంచి వినిపిస్తున్న వాదన. మరి ఇందులో నిజమెంతో గానీ, ఇది పవన్‌కి బ్యాడ్‌ న్యూస్‌, `రాధేశ్యామ్‌`, `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రాలకు గుడ్‌న్యూస్‌గా చెప్పొచ్చు. 

పెంచిన టికెట్‌ రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి. (ఈ రేట్లకి అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు)

కార్పొరేషన్లలో ఏసీ థియేటర్లలో రూ.70, రూ.100
కార్పొరేషన్లలో నాన్‌ ఏసీలో టికెట్ ధరలు రూ.40, రూ.60
కార్పొరేషన్‌ స్పెషల్‌ థియేటర్లలో రూ.100, రూ.125
కార్పొరేషన్‌ మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ ధర రూ.150, రూ. 250

మున్సిపాలిటీల్లో ఏసీ థియేటర్లలో రూ.60, రూ.80
మున్సిపాలిటీల్లో నాన్‌ ఏసీలో టికెట్ ధరలు రూ.30, రూ.50
మున్సిపాలిటీల్లో స్పెషల్‌ థియేటర్లలో రూ.80, రూ.100
మున్సిపాలిటీల్లో మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ ధర రూ.125, రూ. 250

నగర పంచాయతీల్లో ఏసీ థియేటర్లలో రూ.50, రూ.70
నగర పంచాయతీల్లో నాన్‌ ఏసీలో టికెట్ ధరలు రూ.20, రూ.40
నగర పంచాయతీల్లో స్పెషల్‌ థియేటర్లలో రూ.70, రూ.90
నగర పంచాయతీల్లో మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ ధర రూ.100, రూ. 250