బిగ్‌బాస్‌ హౌజ్‌లో సోమవారం ఎపిసోడ్‌లో రాజు, అధికారమనే గేమ్‌ పెట్టాడు బిగ్‌బాస్‌. దీని ప్రకారం  రాజు తన అధికారం ఉపయోగించే ఏదైనా చేయొచ్చని, తన రాజ్యంలో ప్రజలకు శిక్షలు వేసే అధికారం ఉందని, ఎలాంటి రూల్స్ అయినా పెట్టే ఛాన్స్ ఉందని, దీనికి ఎలాంటి అపరిమితులు లేవని తెలిపారు. అఖిల్‌ డైరెక్ట్‌గా గ్రాండ్‌ ఫినాలేకి ఎంపికైన సందర్భంగా ఆయన ఈ గేమ్‌లో ఉండరు. మిగిలిన ఐదుగురు అభిజిత్‌, హారికి, అరియానా, సోహైల్‌, మోనాల్‌ పాల్గొన్నారు. అఖిల్‌ రాజుకి మంత్రిగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఈ గేమ్‌లో మొదట కిరీటాన్ని దక్కించుకుని సోహైల్‌ హౌజ్‌ని నవ్వులు పూయించాడు. ముఖ్యంగా అరియానా రెచ్చిపోయింది. సోహైల్‌ని ఓ ఆట ఆడుకుంది. రాజుగా ఆయన పరువు తీసింది. తనకు నచ్చినట్టు ఆడి వినోదాన్ని పంచింది. అభిజిత్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత రాణి అయిన హారిక.. సోహైల్‌, అఖిల్‌ మధ్య చిచ్చు పెట్టింది. మొదట ఎపిసోడ్‌ ప్రారంభంలోనే హారిక విషయంలో సోహైల్‌, అఖిల్‌ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. హారికతో కూర్చున్న అఖిల్‌.. సోహైల్‌ పిలిచినా వెళ్ళలేదు. దీంతో అప్పుడే అమ్మాయి ఉంటే ఆగరని సెటైర్లు వేశాడు. 

ఇక హారిక రాణి అయ్యాక మంత్రిగా ఉన్న అఖిల్‌.. ఆమె చెప్పిన పని చేస్తాడు. సోహైల్‌ డాన్స్ కోసం చెప్పిన టైమ్ కి రాలేదని, ఆయన బట్టలు తెప్పించి, వాటర్‌లో పడేస్తుంది హారిక. దీంతో సోహైల్‌ ఫైర్‌ అయ్యాడు. ఈ సందర్భంగా అఖిల్‌పై ఫైర్‌ అయ్యాడు. తాను రాజుగా ఉన్నప్పుడు చేయలేదని, ఆమె చెబితే చేస్తున్నాడని మండిపడ్డాడు సోహైల్‌. దీన్ని ఖండించాడు అఖిల్‌. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మొత్తానికి హౌజ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న వీరిద్దరి మధ్య హారిక చిచ్చుపెట్టిందని చెప్పొచ్చు. బిగ్‌బాస్‌ చెప్పినట్టు స్నేహాన్ని పక్కన పెట్టి ఎవరి గేమ్‌ వాళ్లు ఆడుతున్నారని నిరూపించుకున్నారు.