బిగ్ బాస్ హౌజ్ లో రక్తికడుతున్న కంటెస్టంట్స్ పోరు చాలా పక్కాగా గేమ్ ఆడుతున్న పార్టిసిపెంట్స్ కొత్త కెప్టెన్ గా ఎన్నికైన దీక్షా పంథ్ హౌజ్ ను దెయ్యాల కొంపగా మార్చిన బిగ్ బాస్

ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'బిగ్ బాస్' రియాల్టీ షో... మరో మూడు వారాల్లో ముగియనుండటంతో... కంటెస్టంట్స్ చాలా ప్లాన్డ్ గా డిప్లమాటిక్ గా వ్యవహరిస్తున్నారు. ఇంట్లో గేమ్ బాగా ఆడుతూ బలవంతులుగా ఉన్న సభ్యులు... తమకు పోటీగా ఉన్న ఇతర సభ్యులను ఇంటి నుండి బయటకు పంపేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు.

సోమవారం జరిగిన పరిణామాలు పరిశీలిస్తే... ఎలిమినేషన్ నామినేషన్స్ సమయం వచ్చినపుడు తమకు పోటీగా ఉన్నవారిని నామినేట్ చేసిన వైనం కనిపించింది. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో హరితేజ, ప్రిన్స్, అర్చన, ఆదర్శ్, నవదీప్ నామినేట్ అయ్యారు.

ఇక కెప్టెన్‍‌ ముమైత్ ఇంటి నుండి ఎలిమినేట్ అయి వెళ్లిపోవడంతో కొత్త కెప్టెన్ ను ఎన్నిక తప్పనిసరైంది. కెప్టెన్సీ కోసం నవదీప్, దీక్ష పోటీ పడగా... ఆదర్శ్, హరితేజ, శివ బాలాజీ సపోర్టుతో దీక్ష కొత్త కెప్టెన్‌గా ఎంపికైంది.

నామినేషన్ ప్రక్రియలో ప్రిన్స్, అర్చనలను దీక్ష...., ఆదర్శ్, హరితేజలను అర్చన...., ప్రిన్స్, ఆదర్శ్‌లను శివ బాలాజీ...., నవదీప్, అర్చనలను ఆదర్శ్..., హరితేజ, ప్రిన్స్ లను నవదీప్..., ఆదర్శ్, నవదీప్ లను హరితేజ..., నవదీప్‌, హరితేజలను ప్రిన్స్... నామినేట్ చేశారు.

బిగ్ బాస్ ఇంట్లో దెయ్యాలు

సోమవారం షోను మరింత వినోదాత్మకంగా సాగించేందుకు బిగ్ బాస్ హారర్ కాన్సెప్ట్ టాస్క్ ఇచ్చారు. తొలుత దెయ్యాల రూపంలో ఇంటి సభ్యులను భయ పెట్టే ప్రయత్నం చేశారు. తర్వాత ఇంటి సభ్యులను రెండు టీమ్ లుగా విడగొట్టి దెయ్యాల టాస్క్ ఆడించారు. బిగ్ బాస్ హౌజ్ అంతా స్మశానంలా మార్చేశారు. టాస్క్ లో భాగంగా ముగ్గురు దెయ్యాలుగా, ముగ్గురు మనుషులుగా చేశారు. కెప్టెన్ దీక్ష ఆధ్వర్యంలో ఈ టాస్క్ జరిగింది. దెయ్యాల తమ పనులతో మనుషులను భయపెట్టాలి, మనషులు దెయ్యాలకు భయపడకుండా ఉండాలి. ఎవరు బాగా చేస్తే వారే విజేతలు. విజేతలు ఎవరో మరుసటిరోజు తేలనుంది.

అయితే.. ఈ ఆటలో హరితేజ, ప్రిన్స్ ఆదిలు మిగతా సభ్యులను తెగ ఆటపట్టించారు. నిబంధనల ప్రకారం దెయ్యాలు ఏం చేసినా మిగతా ఇంటిసభ్యులు రియాక్ట్ కాకూడదు. ఈ టాస్క్ లో హరితేజ శివబాలాజీని ఆడుకోగా, ఆదర్శ్ అర్చనను తెగ ఆడేసుకున్నారు. మొత్తానికి బిగ్ బాస్ దెయ్యం మాత్రం అర్చనను తెగ భయపెట్టేసింది.