భీమ్లా నాయక్ చిత్రం తర్వాత సాగర్ చంద్ర టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయారు. సాగర్ చంద్ర కి వరుస అవకాశాలు దక్కుతున్నాయి.  

భీమ్లా నాయక్ చిత్రం సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్ళీ పుంజుకుంది. అదే జోష్ లో టాలీవుడ్ బడా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. భీమ్లా నాయక్ చిత్రం వెనుక ఉన్నది త్రివిక్రమ్ శ్రీనివాస్ అయినప్పటికీ.. ఆ మూవీ అంతటి ఘనవిజయం సాధించింది అంటే అందుకు ప్రధాన కారణం దర్శకుడు సాగర్ చంద్ర. 

అయ్యప్పన్ కోషియం లాంటి రీమేక్ మూవీలో పవన్ కళ్యాణ్, రానా లాంటి స్టార్స్ ని సాగర్ చంద్ర అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఫలితంగా ప్రేక్షకులు మెచ్చే అవుట్ ఫుట్ బయటకు వచ్చింది. దీనితో సాగర్ చంద్రపై ప్రశంసలు కురిశాయి. భీమ్లా నాయక్ చిత్రంతో సాగర్ చంద్ర కెరీర్ కి కొత్త జోష్ వచ్చినట్లు తెలుస్తోంది. 

ప్రముఖ నిర్మాణ సంస్థలు సాగర్ చంద్ర దర్శకత్వంలో సినిమా నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సాగర్ చంద్ర ఒక మూవీ చేయబోతున్నారు. ఓ స్టార్ హీరో ఈ చిత్రంలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

అలాగే భవ్య క్రియేషన్స్ సంస్థ కూడా సాగర్ చంద్రతో సినిమా నిర్మించేందుకు ముందుకు వచ్చిందట. ఓ ప్రముఖ హీరో కోసం సాగర్ చంద్ర ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరికొందరు నిర్మాతలు కూడా అడ్వాన్సులతో సాగర్ చంద్ర కోసం రెడీ అవుతున్నారు. 

భీమ్లా నాయక్ తర్వాత సాగర్ చంద్ర పేరు టాలీవుడ్ లో బాగా వినిపిస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు. ఫిబ్రవరి 25న విడుదలైన భీమ్లా నాయక్ చిత్రం తిరుగులేని విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ సరసన ఈ చిత్రంలో నిత్యామీనన్.. రానాకి జోడిగా సంయుక్త మీనన్ నటించారు.