బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమా తోడేలు. వరుణ్ ధావన్ హీరోగా చేసిన ఈ సినిమా ఆరు నెలల క్రితం విడుదల అయింది. అల్లు నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ హిందీ మూవీ భేడియాను తోడేలుగా డబ్బింగ్ చేసి విడుదల చేసింది. 


థియేటర్ లో చూద్దామనుకుని అక్కడ పెద్దగా ఆడని సినిమాలను ఓటిటిలలో చూద్దామని జనం ఫిక్స్ అవుతూంటారు. అలా ఫిక్సైన చూసిన సినిమాలకు ఓటిటిలో మంచి వ్యూయర్ షిప్ ఉంటుంది. అయితే ఈ రోజుల్లో థియేటర్‌లో సినిమా విడుదలైన నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అంతెందుకు పెద్ద స్టార్స్ చేసిన వాల్తేరు వీరయ్య, దసరా వంటి బ్లాక్‌ బస్టర్‌లు సైతం నెలరోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేశాయి. ఒక్క తెలుగు అనే కాదు అన్ని భాషల్లోనూ ప్రస్తుతం ఇదే పరిస్థితి. అదే సినిమా తేడా కొడితే పదిహేను రోజులకే ఓటిటిలో దర్శనమిస్తోంది. అయితే చిత్రంగా వరుణ్ ధావన్ నటించిన తోడేలు సినిమా మాత్రం ఇన్నాళ్లుగా ఓటిటిలోకి రాలేదు. సరైన రేటు రాలేదని ఆపారని టాక్. 

 హిందీ సినిమా 'భేడియా'ను తెలుగులో గీతా ఆర్ట్స్‌కు చెందిన గీతా డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేసింది. వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన హిందీ సినిమా 'భేడియా'. హిందీ హిట్స్ 'స్త్రీ', 'బాలా' తర్వాత అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన చిత్రమిది. హారర్ కామెడీ సినిమాలు 'స్త్రీ', 'రూహి' తర్వాత దినేష్ విజయన్ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన చిత్రమిది. ఈ సినిమాపై హిందీలో మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. తెలుగులో ఈ సినిమాను 'తోడేలు'గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది గీతా డిస్ట్రిబ్యూషన్ సంస్థ! అయితే అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. 

ఇండియన్ స్క్రీన్ మీద తొలి క్రియేచర్ కామెడీ జానర్ మూవీ ‘తోడేలు’.దర్శకుడు అమర్ కౌశిక్. ఈ అత్యున్నత సాంకేతిక విలువలతో హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌తో ఈ సినిమా ఉందిట. గన్ మెర్విక్, గాడ్జిలా వెర్సస్ కింగ్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ చిత్రానికి గ్రాఫిక్స్ వర్క్ అందివ్వడం ప్లస్ పాయింట్. మనిషి తోడేలుగా మారడం, అడవి, అడవిలో పున్నమి వీటన్నింటినీ చాలా సహజంగా, ఒళ్ళుగగుర్పొడిచే విధంగా చూపించారుట ఇందులో. మనిషి నుంచి తోడేలుగా మారడం అనేది చాలా భయానకంగా ఉంటుంది. ఒక్కో భాగం మారుతున్న తీరు.. తోడేలు ఎక్స్ ప్రెషన్స్.. నిజమైన తోడేలు ఇలాగే ఉంటుందా? అన్నంత నేచురాలిటీ తీసుకునివచ్చారు. vfx 3D టెక్నాలజీలో తోడేలు చూస్తుంటే ఏదో కొత్త ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుందిట. తోడేలు దూకేటప్పుడు.. అరిచేటప్పుడు.. ఇలా చాలా సందర్భాల్లో మంచి విజువల్ ట్రీట్ కలుగుతుంది.

చిత్రం కథేమిటంటే..

ప్రభుత్వ కాంట్రాక్టర్ అయిన భాస్కర్ (వరుణ్ ధావన్) అరుణాచల్ ప్రదేశ్‌లోని ఓ దట్టమైన అటవీ ప్రాంతంలో రోడ్డు వేసే కాంట్రాక్టు దక్కించుకుంటాడు. దానిలో భాగంగా అక్కడ అడవుల్ని నరికి.. అక్కడ జీవనం సాగిస్తున్న ఆదివాసులు నుంచి ల్యాండ్ పూలింగ్ చేయాలని అక్కడికి వెళ్తాడు. నాగరికతకు దూరంగా ఉన్న వాళ్ళని మోసం చేసి స్థలాలను తీసుకోవడానికి చూస్తాడు. అయితే ఇతని ప్రయత్నానికి అడ్డుకట్ట వేస్తుంది ఓ తోడేలు. అడవిలో తిరుగుతున్నప్పుడు ఒక తోడేలు భాస్కర్‌ మీద దాడి చేస్తుంది. అప్పడు అది అతన్ని కరుస్తుంది. అప్పటి నుంచి భాస్కర్‌లో మార్పులు మొదలౌతాయి. అతను రాత్రి అయ్యేసరికి తోడేలుగా మారతాడు. అడవిని నాశనం చేయాలనుకునే వాళ్ళ పాలిట హంటర్‌గా మారతాడు. పగలు భాస్కర్‌గా.. రాత్రి అయ్యేసరికి తోడేలుగా.. అతని జీవితం ఒక్కసారిగా తలకిందులు అవుతుంది. మరి భాస్కర్‌ తిరిగి మనిషిగా మారాడా? అసలు అతన్ని తోడేలుగా మార్చిందెవరు? ఎందుకు? అన్నదే సినిమా కథ. 

ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. కాగా ఇన్నాళ్లకు మేకర్స్‌ స్ట్రీమింగ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమాలో మే 26వ తేది నుంచి హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌ కానుంది. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ రానుంది. ఇటీవలే సీక్వెల్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను మేకర్స్‌ ప్రకటించారు. అనుకోకుండా ఓ మనిషి తోడేలులా మారితే వాళ్ల జీవితం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో భేదియా మూవీ తెరకెక్కింది. వరుణ్‌ధావన్‌కు జోడీగా కృతిసనన్‌ నటించింది.