Asianet News TeluguAsianet News Telugu

భగవద్గీతా గాన, ప్రచార కర్త ఎల్‌ వీ గంగాధర శాస్త్రికి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు..

ఘంటసాల ఆలపించిన భగవద్గీతని తనదైన శైలిలో ఆలపించి ఆదరణ పొందారు గంగాధర శాస్త్రి. ఆయన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించింది. 
 

Bhagavad Gita fame gangadhara sastry got indian prestigious kendra sangeet natak acadamy award arj
Author
First Published Feb 28, 2024, 8:32 PM IST

భగవద్గీతా పారాయణం ని ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఘంటసాల ఎంతో అద్భుతంగా ఆలపించారు. అది అంతగా మారుమోగుతుంది. ఆ తర్వాత దాన్ని మరింత అందంగా ఆలపించారు `భగవద్గీతా ఫౌండేషన్‌` వ్యవస్థాపకులు డా. ఎల్‌వీ గంగాధర శాస్త్రి. అంతేకాదు ఆయన గాయకులుగా, భగవద్గీతా గాన, ప్రవచన, ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. భగవద్గీతా ప్రచారానికి ఎంతో సేవలందిస్తున్నారు. తాజాగా ఆయనకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక `కేంద్ర సంగీత నాటక అకాడమీ` అవార్డుకి ఎంపిక చేసింది.

2023 సంవత్సరానికి గాను ఇతర ప్రధాన సంప్రదాయ సంగీత విభాగంలో ఆయనకు ఈ 'అకాడమీ పురస్కారం' లభించింది. తాను అభ్యసించిన కర్ణాటక శాస్త్రీయ సంగీతంతో, భారత దేశపు ఆధ్యాత్మిక సారమైన భగవద్గీత లోని 700 శ్లోకాలలో  ఘంటసాల స్వరపరచి పాడిన 108 శ్లోకాలను ఆయన గౌరవార్థం యథాతథంగా పాడడంతోపాటు, మిగిలిన 594 శ్లోకాలను స్వీయ సంగీతంలో, తెలుగు తాత్పర్య సహితంగా గానం చేశారు. అంతేకాదు అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, `భారతీయ గాయకుడి తొలి సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత`గా శ్రీ శ్రీ శ్రీ విశ్వేశ తీర్థ స్వామి, మాజీ రాష్ట్రపతి డా. ఏ పి జె అబ్దుల్ కలాం చేతుల మీదుగా విడుదల చేశారు. 

గంగాధర శాస్త్రి సేవాలను గురించి గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'కళారత్న'(హంస) పురస్కారం తోను, మధ్యప్రదేశ్ లోని మహర్షి పాణిని యూనివర్సిటీ 'గౌరవ డాక్టరేట్' తోను సత్కరించింది. కాగా ఇప్పుడీ అవార్డు ప్రకటించిన నేపధ్యంలో 'గీత' పట్ల తన అంకిత భావాన్ని గత 16 సంవత్సరాలుగా గుర్తిస్తూ వచ్చిన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖామంత్రి  జి. కిషన్ రెడ్డి కి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, అలాగే సంగీత నాటక అకాడమీ' అకాడమీ చైర్మన్ డా. సంధ్య పురేచకు, జ్యూరీ సభ్యులకు, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ కు గంగాధర శాస్త్రి  కృతజ్ఞతలు తెలియజేసారు. ఇది తనకు తొలి జాతీయ అవార్డు అన్నారు.

`ఈ అవార్డు.. పాట నేర్పిన తన తల్లి తండ్రులకు, ‘గీతా గాన మార్గదర్శి’ ఘంటసాలకు, గీతా సద్గురువులకు, శాస్త్రీయ సంగీతం నేర్పిన గురువులకు అంకితమన్నారు. 'భగవద్గీత' అంటే భారతదేశపు ఆలోచనా విధానమని, ఇది మతాలకు అతీతమైన, సర్వజనామోదయోగ్యమైన, ఆచరణీయమైన, అత్యుత్తమమైన కర్తవ్య బోధ అనీ, దీనిని ప్రతి ఒక్కరూ చదివి, అర్ధం చేసుకుని, ఆచరించడం ద్వారా  స్వార్ధరహిత  ఉత్తమ సమాజాన్ని ఏర్పరచవచ్చని, అందుకే తమ 'భగవద్గీతా ఫౌండేషన్' ద్వారా గీతా ప్రచారం కోసమే తన జీవితాన్ని అంకితం చేశానని గంగాధర శాస్త్రి అన్నారు.

 భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించడం ద్వారా ఈ దేశపు జ్ఞాన సంపదను గౌరవించాలని భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలనూ కోరుతున్నామని, గీతను  పాఠ్యాంశం గా చేర్చి బాల్య దశ నుంచే పిల్లలకు నేర్పించడం ద్వారా, మానవీయ విలువలను పెంపొందించవచ్చని  ఆయన అన్నారు. ఇప్పటికే అయోధ్యలో రామాలయ నిర్మాణం ద్వారా భారతీయుల ఆత్మ గౌరవాన్ని కాపాడినందుకు, పాఠ్య పుస్తకాల్లో మన దేశం పేరుని భారత్ గా మార్పు చేసి చరిత్రను కాపాడినందుకు కేంద్ర ప్రభుత్వానికి నమస్సులతో  కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు గంగాధర శాస్త్రి.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios