బాహుబలి తర్వాత అనుష్క శెట్టి నటించిన భాగమతి చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నది. యూవీ క్రియేషన్స్ రూపొందించిన ఈ చిత్రం అందరి అంచనాల తలకిందులు చేస్తూ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్నది. మంగళవారం జరిగిన భాగమతి థ్యాంక్యూ మీట్‌లో నిర్మాతలు, డిస్టిబ్యూటర్ దిల్ రాజు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

రిపబ్లిక్ డేను పురస్కరించుకొని భాగమతి చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 1200 స్క్రీన్లలో రిలీజైంది. సెలవు దినం కావడం, అడ్వాన్స్ బుకింగ్ రూపంలో తొలి రోజునే భారీ కలెక్షన్లను సాధించింది. వారాంతం తర్వాత కూడా సోమవారం తెలుగు రాష్ట్రాల్లో రూ.కోటికిపైగా వసూళ్లను సాధించింది అని దిల్ రాజు వెల్లడించారు.

తొలి వారంతంలో తెలుగు, తమిళం, మలయాళం మూడు భాషల్లో కలిపి భాగమతి రూ.28.75 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.7.65 కోట్లు సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే 36 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేయడం అనుష్క స్టామినాకు అద్దం పట్టింది.

సాధారణంగా మూడు రోజుల తర్వాత కలెక్షన్లు కొంత మేరకు తగ్గుముఖం పడుతాయి. కానీ భాగమతి చిత్రం వసూళ్లు తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ మార్కెట్‌లో సోమవారం కూడా భారీగా నమోదు చేసిందని నిర్మాత దిల్ రాజు భాగమతి థ్యాంక్యూ మీట్‌లో చెప్పడం గమనార్హం.

ఓవర్సీస్ మార్కెట్‌లో ముఖ్యంగా అమెరికాలో ఈ చిత్రం రెండు రోజుల్లోనే హాఫ్ మిలియన్ డాలర్లను వసూలు చేసింది. గురువారం నాటి ప్రీమియర్ షో 250కే డాలర్లు, శుక్రవారం 275కే డాలర్లు వసూలు చేయడం గమనార్హం. 

భాగమతి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళం, మలయాళం భాషల్లో కూడా మంచి కలెక్షన్లు సాధిస్తున్నది. భాగమతి తొలివారం ముగిసే సరికి రూ.50 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది అని ట్రేడ్ పండితులు పేర్కొంటున్నారు.

భాగమతి చిత్రం సుమారు రూ.30 వ్యయంతో దర్శకుడు జీ అశోక్ తెరకెక్కించాడు. తెలుగు థియేట్రికల్ హక్కుల రూపంలో రూ.20 కోట్లు సమకూరినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్ స్వయంగా పంపిణీ చేయడం గమనార్హం.