బెంగాలీ లెజెండరీ నటుడు సౌమిత్ర ఛటర్జీ కన్నుమూత
ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ(85) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుది శ్వాస విడిచారు.
ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ(85) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుది శ్వాస విడిచారు. గత నెల 6న ఆయన కరోనాకి గురయ్యారు. పాజిటివ్ అని తేలడంతో కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. వారం రోజుల తర్వాత ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. నెగటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కానీ మరోసారి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అక్టోబర్ 14న ఆస్పత్రికి తరలించారు. ఇన్ని రోజులు అనారోగ్యంతో పోరాడిన ఆయన ఆదివారం తుది శ్వాస విడిచారు.
దీంతో బెంగాల్ చిత్ర పరిశ్రమలోనే కాదు, యావత్ ఇండియన్ సినిమాకి ఆయన మరణం తీరని లోటని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తరహాలోనే సౌమిత్ర చటర్జీ కరోనాతో కోలుకుని అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం బాధాకరం. కరోనా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, వాటిని పాడు చేస్తుందనే విషయం తెలిసిందే. వీరి విషయంలో కూడా అదే జరిగిందని అర్థమవుతుంది. లెజెండరీ నటుడు మరణంతో బెంగాలీ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
బెంగాలీలో తొలి తరం నటుల్లో అగ్ర స్థానం సంపాదించిన సౌమిత్ర ఛటర్జీ..ప్రధానంగా లెజెండరీ దర్వకుడు సత్యజిత్ రే సినిమా `అపుర్ సంసార్` తో నటుడిగా కెరీర్‌ని ప్రారంభించారు. ఉత్తమ నటుడిగా ఆయన మూడు జాతీయ అవార్డులు అందుకున్నారు. అలాగే దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన సినిమాకి చేసిన సేవలకుగానూ 2004లో కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది.